calender_icon.png 18 November, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలుపు మొక్కలపై చర్యలుంటాయి

18-11-2025 12:28:09 AM

  1. సంపత్‌కుమార్ వారి పేర్లను ఇస్తే విచారిస్తాం 
  2. డీసీసీ అధ్యక్షుల ప్రకటన ఎప్పుడైనా రావొచ్చు 
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 
  4. ఓటు చోరీకి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నిరసన

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ప్రతి పార్టీలోనూ కలుపు మొక్కలుంటాయని, తమ పార్టీలోనూ కలుపు మొక్కలున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని, కలుపు మొక్కల పేర్లను ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఇస్తే విచారిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్ప ష్టం చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో సీనియర్ నేత వి హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి  సంపత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యంజయ్, పార్టీ నేతలతో కలిసి  మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాత, కొత్త నేతల కలయిక అని, పాత నేతలకు ఉండే ప్రాముఖ్యత ఎప్పుడు ఉంటుందన్నారు.

డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయంలో తమ పరిధిలోని అంశాలన్ని పూర్తయ్యాయని, తుది నిర్ణయం అధిష్ఠానం చేతుల్లోనే ఉందని చెప్పారు. డీసీసీ అధ్యక్షుల నియా మక నిర్ణయం అధిష్ఠానం నుంచి ఎప్పుడైనా రావొచ్చన్నారు. బీహార్‌లో ప్రజల అభీష్టం, ఆశయాల మేరకు ఎన్డీఏ అధికారంలోకి రాలేదని, ఓటు చోరీతోనే గెలిచిందని ఆరోపించారు. బీహార్‌లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ కంటే ఎస్‌ఐఆర్ పేరుతో తొలగించిన ఓట్ల సంఖ్య ఎక్కు వ ఉందని ఆయన ఆరోపించారు.

మక్కాలో జరిగిన ప్రమాద సంఘటన బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉటుందన్నారు. కాగా ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మహా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ..  కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి ఫ్రంట్ ఆర్గనైజర్‌గా మారిందని దుయ్యబట్టారు.

తెలంగాణలోనూ సర్ పేరిట ఓట్లు తొలగించే ప్రమాదం పొంచి ఉందన్నారు. మంగళవారం నుంచి రాష్ట్రం లో ఓట్ చోరిపై సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వి హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎంపీ అనిల్‌కుమార్ హాజరయ్యారు.