12 July, 2026 | 7:32 PM

జ్యోతికి లైన్ క్లియర్

04-05-2024 12:56 AM

న్యూఢిల్లీ: తెలుగు అథ్లెట్, ఆసియా గేమ్స్ మెడలిస్ట్ జ్యోతి ఎర్రాజీ పారిస్ ఒలింపిక్స్ అర్హత పోటీల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. ఒలింపిక్స్ అర్హతకు సంబంధించి యూరప్‌లో జరగనున్న పలు ఈవెంట్‌లకు ఆర్థిక సహాయం అందించాలంటూ జ్యోతి ఇటీవలే మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంవోసీ)కు అభ్యర్థన పెట్టుకుంది. తాజాగా శుక్రవారం క్రీడాశాఖ ఆధ్వర్యంలో మిషన్ ఒలింపిక్ సెల్  కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలోనే జ్యోతి ప్రతిపాదనను అంగీకరిస్తూ ఆమె ఫ్లుటై టికెట్స్, వీసా, మెడికల్, ఫిజియో, ఇతరత్రా ఖర్చులను భరించడానికి సిద్ధమని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్‌లో అర్హత సాధించడమే లక్ష్యంగా మేలో యూరప్‌కు వెళ్లనున్న జ్యోతి అక్కడ ఆరు ముఖ్యమైన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ టోర్నీల్లో పాల్గొననుంది. కాగా జ్యోతితో పాటు లాంగ్ జంపర్ శైలీ సింగ్, బ్యాడ్మింటన్ ప్లేయర్లు కిరణ్ జార్జ్, ఆయుష్ శెట్టి, రక్షిత ప్రతిపాదనలను కూడా అంగీకరించిన ఎంవోసీ అందుకు సంబంధించిన అనుమతులు జారీ చేసింది.