మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కల్లూరు, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కల్లూరు విశాల సహకార పరపతి సంఘం వారి ఆధ్వర్యంలో కాన్కాన్పేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి,మున్సిపాలిటీ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
త రెండు మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు, మబ్బుల కారణంగా ఆందోళన చెందిన రైతులకు ఈ కేంద్రాల ప్రారంభం ఉపశమనాన్ని కలిగిస్తుందని తెలిపారు.రైతులు పండించిన ఏ గ్రేడ్ సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు రూ. 2389, దుడ్డు రకం ధాన్యానికి రూ. 2369 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
మద్దతు ధర పొందేందుకు పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కార్డు,బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్,వ్యవసాయ అధికారుల ద్వారా జారీ చేసిన సాగు ధృవీకరణ పత్రాలు కొనుగోలు కేంద్రాల వద్ద సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.ఈ విధానం ద్వారా మధ్యవర్తులు,దళారుల ప్రభావం లేకుండా రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు.వరి ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి,చెత్త,తాలు, మట్టి,రాళ్లు లేకుండా శుభ్రంగా ఉంచినపుడే మద్దతు ధర వర్తిస్తుందని రైతులకు అవగాహన కల్పించారు.
అందువల్ల రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించి ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి,సొసైటీ స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి వ్యవసాయ అధికారి రూప, ఎమ్మార్వో బ్రహ్మేశ్వర రావు,ఆర్‌ఐ హరి ప్రసాద్,కౌన్సిలర్లు దాసరి సుధారాణి,భూక్య రాంబాయి, ఉబ్బన రాంబాబు,సీఈవో లు వేలాద్రి,వెంకటేశ్వరరావు,జిల్లా యువజన నాయకులు ధరావత్ రవికుమార్,కాంగ్రెస్ నాయకులు యాస శ్రీకాంత్,శీలం కృష్ణారెడ్డి, కిష్టంశెట్టి కొండల్,రైతులు తదితరులు పాల్గొన్నారు.




