4 May, 2026 | 6:58 PM

ప్రారంభించారు సరే.. సేకరణ ఇంకెప్పుడు?

04-05-2026 05:18 PM

* ధాన్యం సేకరణ ప్రారంభం కాకపోవడంతో ఆపసోపాలు పడుతున్న రైతన్నలు 

* కొనుగోలు కేంద్రాల్లో కొరవడిన వసతులు

* తూకం త్వరితగతిన ప్రారంభించకుంటే చివరలో అవస్థలే

* గత్యంతరం లేక దళారులను ఆశ్రయిస్తున్న కొందరు రైతన్నలు

పాపన్నపేట: అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా ఉంది రైతన్నల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చే సమయానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా అవి సమయానికి వారికి ఏ విధంగాను ఉపయోగపడటం లేదు. మరికొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో దళారుల దందా మొదలైంది. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో దాన్యం సేకరణ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రోజుల తరబడి కల్లాల్లోనే మూలుగుతున్నాయి. కొందరు రైతులు గత్యంతరం లేక డబ్బు అవసరంతో దళారులను ఆశ్రయించడంతో వారు క్వింటాలుకు నగదు తక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మండలంలో వరి కోతలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని గ్రామాల్లో అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమే కాలేదు.

మండలంలో మొత్తం 35 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

మండలంలో మొత్తం 35 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తారు. పాపన్నపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 8, కొత్తపల్లి 15, చికోడ్ 4, ఐకెపి ఆధ్వర్యంలో 8 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తారు. ఇంకా పలు కేంద్రాల్లో ఇప్పటికీ ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా త్వరితగతిన కొనుగోలు కేంద్రాల్లో తూకం ప్రారంభించి అవస్థలు తీర్చాలని రైతన్నలు కోరుతున్నారు. ఈ విషయమై ఆయా సొసైటీల సీఈఓ లను వివరణ కోరగా.. హమాలీల కారణంగా ధాన్యం సేకరణ ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు.