19 May, 2026 | 3:58 AM

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

19-05-2026 12:47 AM

అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం

రంగారెడ్డి, మే 18 (విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ సీజన్లో 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి, దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 37 ధాన్యం కొనుగోలు కేంద్రాలను (పీపీసీ) ప్రారంభించామని, వాటి ద్వారా 7,187 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇప్పటివరకు రూ. 6 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని ఆయన పేర్కొన్నారు.

మిల్లర్లు తరుగు తీస్తే క్రిమినల్ కేసులు...

రైస్ మిల్లర్లు తమ సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యాన్ని త్వరితగతిన అన్లోడ్ చేసుకోవాలని, తరుగు పేరుతో ఎలాంటి నాణ్యత కోతలు విధించకుండా ధాన్యాన్ని స్వీకరించాలని స్పష్టం చేశారు. మిల్లుల వద్ద ధాన్యం లోడ్తో ఉన్న ఏ వాహనమైనా ఒక రోజు కంటే ఎక్కువ కాలం వేచి ఉండకూడదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లాలోని అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యాత్మక కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించేందుకు జిల్లా అధికారులకు ప్రత్యేక బాధ్యతలను కేటాయించారు.

ఏఈఓలు ధాన్యం నాణ్యతను సక్రమంగా ధృవీకరించాలని, ఆ తర్వాత నాణ్యతపై ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు. రవాణా కాంట్రాక్టర్లు కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు.డీ ఎల్‌ఎంఓలు వెయ్బ్రిడ్జ్లను నిరంతరం తనిఖీ చేస్తూ, అన్ని ప్రాంతాల్లో తూకం ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో డి.ఎం., డీసీఎస్‌ఓ , డీఆర్డీఓ  డీఎంఓ డీఎల్‌ఎంఓ  డీసీఓ మరియు జిల్లా రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.