డీలిమిటేషన్‌లో వాటా తగ్గితే ఉద్యమిస్తాం
మహిళా బిల్లుకు, డీలిమిటేషన్‌కు లింక్ ఏందుకు?
లోక్ సభలో తెలంగాణకు ఉన్న 3.13 శాతం సీట్ల ప్రాతినిథ్యం కొనసాగాలి
కేంద్రానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అల్టిమేటం
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోం దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కేం ద్రంలోని బీజేపీ సర్కార్ పార్లమెంట్‌లో తెలంగాణకు రాజకీయ ప్రాతినిథ్యాన్ని తగ్గిం చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కుట్రలు సాగనివ్వబోమని హెచ్చరిస్తూ గురువారం వీడియో సందేశం విడుదల చేశారు.
మహిళా బిల్లుకు, డీలిమిటేషన్ బిల్లుకు అసలు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మహిళా బిల్లును ఎప్పుడో ఆమోదిం చారని, డీలిమిటేషన్, మహిళా బిల్లు వేర్వేరు అంశాలని చెప్పారు. మహిళల భుజాలపై తు పాకీ పెట్టి డీలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో తెలంగాణకు రాజకీయ ప్రాతినిథ్యం 3.13 శాతంగా ఉందని చెప్పారు. డీలిమిటేషన్‌కు ఏ ప్రాతిపదికన తీసుకున్నా సరే తెలంగాణ ప్రాతినిథ్యం ఏ మాత్రం తగ్గొద్దని తేల్చి చెప్పారు.
మొత్తంగా 50 శాతం సీట్లు పెంచుతామంటూ ప్రతిపాదించటం కూడా సరైన పద్ధతి కాదని కవిత అన్నారు. ఉదాహరణకు బీహార్‌తో పోల్చుకుంటే తెలంగాణలో పెరిగే సీట్లకు చాలా అంతరం ఉంటుందన్నారు. దీని కారణంగా తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం భారీగా తగ్గుతుందన్నారు. కేంద్రం చెప్పే లెక్కల కారణంగా పెద్ద రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజ నం జరుగుతుందన్నారు. ఇప్పటికే నిధులు, జాతీయ ప్రాజెక్ట్‌లకు హోదా ఇచ్చే విషయం లో తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. తెలంగాణ ప్రాతినిథ్యం మరింత తగ్గితే ఇంకా అ న్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్న కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కవిత స్పష్టం చేశారు.
మరో తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఉద్యమాన్ని చేపడతామని కేంద్రాన్ని హెచ్చరించారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్‌ను లింక్ చేయటాన్ని తప్పు పట్టారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లుకు బీసీ సబ్ కోటాను లింక్ చేయాలని సూచించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టిజన్లపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడటం దారుణమని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టిజన్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారికి మద్ద తుగా జాగృతి ఉంటుందన్నారు. అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నిద వర్గాలను వంచిస్తోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
తేజిస్వి సూర్య నీకెంత ధైర్యం? :కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా, పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల 6 దశాబ్దాల ఆ కాంక్ష అంటే అంత చులకన అయ్యిందా అంటూ మండిపడ్డారు. మిస్టర్ తేజస్వీ సూర్య ఎంత ధైర్యం ఉంటే తెలంగాణ పోరాటాన్ని అవమానపరిచేలా మాట్లాడతావంటూ హెచ్చరించారు. తేజస్వీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని విమర్శించారు.
6 దశాబ్దాల పాటు ఎదుర్కొన్న వివక్షకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు చేసిన పోరాటాన్ని తక్కువ చేసి మా ట్లాడతవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్నే కాకుండా తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను కూడా తేజస్వీ అవమానించారని చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడిన సరే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ సమాజానికి జరిగిన అవమానమని అన్నారు. ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అంటూ వారిని ప్రశ్నించారు. వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తేజస్వి సూర్యతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ప్రాంత ఎంపీలుగా కొనసాగే అర్హత మీకు లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే సత్తా లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు.






