ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
కామారెడ్డి, మే 5 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. గాంధారి మండలంలోని గుర్జాల్, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. కేంద్రాల్లోని వసతులు, రైతులకు డబ్బుల చెల్లింపుపై ఆరాతీశారు. రైతులకు మంచినీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున కేంద్రాల నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ట్యాబ్ ఎంట్రీ చేసిన 48 గంటల్లోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేలా చూడాలని వివరించారు. రైస్ మిల్లర్లు హమాలీలను ఎక్కువ సంఖ్యలో పెట్టుకొని, మిల్లులకు లారీలు వచ్చిన వెంటనే అన్‌లోడ్ చేసుకుని ట్రక్ షీట్ జారీ చేయాలని ఆదేశించారు. 2023 ఖరీఫ్‌కు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లు సామర్థ్యం మేరకు మరాడించి నిర్ధేశించిన గడువులోగా భారత ఆహార సంస్థకు చేరవేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, శ్రీనివాస్ రావు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.




