గ్యారెంటీల అమలుపై కేటీఆర్ చీర కట్టుకుని బస్సు ఎక్కితే తెలుస్తుంది
ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా: సీఎం రేవంత్
ఆదిలాబాద్,(నిర్మల్)/వనపర్తి (గద్వాల), మే 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గ్యారెంటీల అమలులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఘాటైన సమాధానం ఇచ్చారు. కేటీఆర్‌కు సినిమా పరిశ్రమ బాగానే తెలుసని, చీర కట్టుకొని ఆడ పిల్లల బస్సులో ప్రయాణిస్తే టికెట్ అడుగుతే గ్యారెంటీలు అమలు కానట్లని, టికెట్ అడగకుంటే గ్యారెంటీలు అమలు అయినట్లని ఆయనకే తెలుస్తుందని ఎద్దేవా చేశా రు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీని చేసి తీరుతామని చెప్పారు.
ఈనెల తొమ్మిదో తేదీలోగా ప్రతి రైతు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చి న కేంద్రంలోని బీజేపీకి కర్రకాల్చి వాత పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన ఏ పోరా టమైనా ఆదిలాబాద్ నుంచి మొదలవుతోందని, టీపీసీసీ అధ్యక్షునిగా నిత్యావసర ధరల పెరుగుదలపై నిర్మల్ నుంచే పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సైతం ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద దళిత, గిరిజన దండోరాతో కేసీఆర్‌పై సమర శంఖాన్ని పూరించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సమావేశం ఇంద్రవెల్లిలోనే ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో సైతం మోడీ, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆదిలాబాద్ గడ్డ నుంచే పోరు ప్రారంభించామన్నారు. ఆదిలాబాద్ అంటే తనకు ఎంతో ప్రత్యేకమని, ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, కాంగ్రెస్ పార్టీదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు మహిళలకు అవకాశం ఇవ్వలేదని, కానీ ఆదివాసీ ఆడబిడ్డకు అవకాశం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. రాంజీ గోండు, కొమరం భీంల స్ఫూర్తితో ఆత్రం సుగుణని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నడిగడ్డ పౌరుషానికి మూడు రంగుల జెండాకు అడ్డాగా మారాలి
కృష్ణానది తుంగభద్ర మధ్యలో ఉండే నడిగడ్డ పౌరుషానికి పోరాటానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెట్టింది పేరని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లురవి గెలిపించాలని మాట తీసుకుని ఢిల్లీలో సోనియాగాంధీ చెప్పడానికి రాహుల్‌గాంధీ వచ్చాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులైన గట్టు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్ ఎర్రవెల్లి చౌరస్తా నుండి రాయచూర్ వరకు నాలుగు లైన్ల రోడ్డు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీకి మనందరం అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 5 గ్యారెంటీలనే అమ లు చేశామని, ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షలు, ఇందిరమ్మ ఇండ్లు 22వేల కోట్లను మంజూ రు చేశామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి అమలు చేస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదు అని కేసీఆర్ అంటున్నాడన్నారు.
నడిగడ్డ బండ్ల రాజకీయానికి..
నడిగడ్డ రాజకీయం, బండ్ల రాజకీయం ఇక్కడి ప్రజలందరికి తెలుసునని, పొద్దుగాల చెరొకపార్టీలో ఉంటారు రాత్రి అయితే ఇద్దరు ఒక్కటిగా ఉంటారని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టిని ఓడగొట్టడానికి బీజేపీ బీఆర్‌ఎస్ ఒక్కటయ్యారు అదే బండ్ల రాజకీయమని, బండ్ల రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టి ఈ నడిగడ్డ గద్వాల కాంగ్రెస్ పార్టీ అడ్డగా మూడు రంగుల జెండా ఎగురవేయడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారని సీఎం అన్నారు. బండ్లోలు బొడ్డులో కత్తి పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బయలుదేరిండు అని రేవంత్ చెప్పారు.
అరుణమ్మను జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా, భరత్ సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని వందల వేల కోట్లు సంపాదించుకున్నది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బండ్లోల్లకు ఏం తక్కువ చేసిందని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే, రైల్వే కోచ్ అడిగితే, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అడిగితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. బీజేపీ ఏం ఇచ్చింది.. అరుణమ్మ గాడిద గుడ్డు తెచ్చింది అని ఎద్దేవా చేశారు.
దేశ వనరులు ప్రజలకు చెందాలి
కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ రెండు విషయాలు చెప్పారని, ఈ దేశ వనరులు, సంపద ఈ దేశ ప్రజలకు చెందాన్నదే రాహుల్‌గాంధీ లక్ష్యమన్నారు. నరేంద్రమోదీ లాగా అదానీ, అంబానీలకు అప్పజెప్పడం కాదు ఈ దేశ ప్రజల వెంట ఉంటామని చెప్పే నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకుని వచ్చిన కాంగ్రెస్ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పోరాటం చేస్తున్నదని చెప్పారు.
ఇది పాలమూరు జిల్లా ఇక్కడ పారుతున్న కృష్టా నదిలో నీళ్లు తెచ్చుకోవడం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, 10 ఏండ్లు రాష్ట్ర సంపదను బీఆర్‌ఎస్ నాయకులు దోచుకున్నారు తప్ప ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. శ్రీశైలం, భీమా, నెట్టెంపాడు, ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అయిందని, చుక్క నీళ్లు రాకుండా చేసిన బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, గద్వాల జెడ్పీచైర్మన్ సరిత, సంపత్‌కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.




