బాధ్యత కేంద్రానిదా.. రాష్ట్రానిదా
నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో 20వేల క్వింటాళ్ల పొద్దు తిరుగుడు గింజలు
జిల్లా వ్యాప్తంగా ఎదురుచూస్తున్న రైతులు
కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తుతున్న గింజలు
గజ్వేల్ మే 10: పొద్దు తిరుగుడు రైతులకు ఈసారి పంట అమ్ముకోవడం గగనమైంది. నెలరోజులు దాటుతున్న పొద్దు తిరుగుడు గింజలను కాపలా కాస్తూ కొనుగోలు కేంద్రాల్లోని ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. ఆయా పార్టీల రాజకీయ నాయకులు పొద్దుతిరుగుడు దిగుబడులను త్వరగా కొనుగోలు చేయాలని మొక్కుబడిగా నిరసన వ్యక్తం చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ రైతులు మాత్రం పంట అమ్ముకోలేక, విడిచిపెట్టి ఇంటికి పోలేక ఇబ్బందులు పడుతున్నారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పొద్దు తిరుగుడు కొనుగోలు చేయడానికి సిద్దిపేట, గజ్వేల్, తోగుట, మిరుదొడ్డి మార్కెట్ యార్డులలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత నెల ఒకటో తేదీ నుండి గజ్వేల్, 15 తేదీ నుండి తొగుట, 30వ తేదీ నుండి మిరుదొడ్డి కొనుగోలు కేంద్రాలతో పాటు సిద్దిపేట లోను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తయిందని కొనుగోలు నిలిపివేశారు. దీంతో నాలుగు కొనుగోలు కేంద్రాల్లో వందల సంఖ్యలో రైతులు సుమారు 20 వేల క్వింటాలకు పొద్దు తిరుగుడు గింజలను విక్రయించడానికి ఎదురుచూస్తున్నారు. వడ్లు, మొక్కజొన్న తదితర ఆహార ధాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా, నూనె గింజల కొనుగోలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంది.
అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో అన్ని కొనుగోలు కేంద్రాల్లో పొద్దు తిరుగుడు గింజలు కుప్పలు కుప్పలుగా మూలుగుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షానికి గజ్వేల్ తదితర ప్రాంతాల్లో పొద్దు తిరుగుడు గింజలు మొలకలు కూడా వేస్తున్నాయి. అయినా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా పొద్దు తిరుగుడు రైతులను పట్టించుకోకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. పొద్దు తిరుగుడు పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడికి లాభం వస్తే వర్షాకాలం పంట పండించుకోవడానికి ఏర్పాటు చేసుకోవచ్చన్న రైతుల ఆశలు అడియాసలుగానే మిగిలిపోతున్నాయి.
మళ్లీ వరుసగా వర్షాలు కురిస్తే వర్షం తడులకు, వాతావరణంలో తేమకు పొద్దుతిరుగుడు గింజలు పూర్తిగా పాడయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పొద్దుతిరుగుడు గింజలు కొనుగోలు చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వకపోతే పంటను పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు కొనుగోళ్లకు ఆదేశాలుస్తుందా అంటూ రైతులు ఎదురుచూస్తున్నారు.
40 రోజులు అయింది, గింజలు మొలకెత్తుతున్నాయి
ఎకరం పొలంలో పొద్దుతిరుగుడు పండించాను. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 40 రోజుల మీదనే అయింది. ఇప్పటిదాకా నా పంట కొనలేదు. వర్షానికి తడిసి మొలకలు వచ్చాయి. మా కష్టం ఎవరికి చెప్పుకున్నా తీరే పరిస్థితి కనిపిస్తలేదు. ప్రభుత్వం వెంటనే మా పంట కొంటె ఆ పైసలతో మళ్ళీ వానాకాలం పంటలు వేసుకుంటాం. కొనకుండా ఇట్లనే ఉంటే నా పొద్దుతిరుగుడు గింజలన్నీ పాడవుతున్నాయి.
శివలింగం, రైతు, ముట్రాజ్ పల్లి






