26-11-2025 01:56:29 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి) : జిల్లాలో సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున అన్ని మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అధికారులు పకడ్బందీగా అమలుంచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి తో కలిసి ఎన్నికల నోడల్ అధికారులు, ఎంపీడీవోలు తహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్ల ప్రక్రియపై దిశా నిర్దేశం చేశారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా 1977 ఎన్నికల యాక్టు ప్రకారం మొదటి 24, 48, 72 గంటల్లో అమలు చేయాల్సిన నియమాలను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడుతల్లో నిర్వహించడం జరుగుతుందని, మొదటి విడతలో వనపర్తి, పెద్దమందడి, ఘనపూర్, గోపాల్పేట, రేవల్లి, ఎదుల మండలాల్లోని 86 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు గాను రేపు ఉదయం 10 లోపు ఫార్మా1 ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్.ఒ కార్యాలయంతో పాటు సంబంధిత 87 గ్రామ పంచాయతీలలో అతికించాల్సి ఉంటుందని ఆదేశించారు.
నవంబర్, 27న ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ నవంబర్ 29న సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుందన్నారు. నవంబర్ 30న నామినేషన్ల పరిశీలన ఉంటుందని నామినేషన్లు తిరస్కరణకు గురైన వారు డిసెంబర్ 1న ఆర్డీఓ కార్యాలయము అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అభ్యర్థిత్వం ఉపసంహరణ డిసెంబర్ 3న మధ్యాహ్నం 3.00 గంటల లోపు ఉంటుంది. మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 11న ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.
అదేరోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని నామినేషన్లు క్లస్టర్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మాత్రమే నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవడానికి ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అవకాశం ఉంటుందని, లౌడ్ స్పీకర్లు మాత్రం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. లౌడ్ స్పీకర్లు, ఇతర సభలు సమావేశాలకు అభ్యర్థులు తహసిల్దార్ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
మొదటి విడత ఎన్నికలు నిర్వహించే 780 పోలింగ్ కేంద్రాలను ఎంపీడీఓలు ముందుగానే పరిశీలించి వాటిలో కనీస మౌలిక సదుపాయాలు ఉండే విధంగా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ రోజు నుంచే ఎస్.ఎస్.టి, ఎఫ్.ఎస్.టి బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పై నిఘా పెట్టడం జరుగుతుందన్నారు. అధికారులు చాలా జాగ్రత్తగా ఎన్నికల విధులు నిర్వహించాలని, లేని పక్షంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
జిల్లాలో 4 చెక్ పోస్టులు: జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి
జిల్లాలో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈరోజు నుంచే నిఘా పెట్టడం జరిగిందని, ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.ఎస్.టి బృందాల్లో అనుభవజ్ఞులైన పోలీస్ అధికారులను నియమించినట్లు జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి తెలిపారు. నామినేషన్ కేంద్రంలో వంద మీటర్ల లోపు ఎవరిని అనుమతించబడదని, నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు మరో ఇద్దరు మాత్రమే ఆర్.ఓ కార్యాలయంలో వెళ్లేందుకు అనుమతి ఉంటుందన్నారు.
పోలింగ్ రోజున సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి పోలీస్ భద్రత చేయడం జరుగుతుందని, ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ ఎన్. ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డి.పి.ఓ తరుణ్ చక్రవర్తి, అందరూ నోడల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.