28 August, 2026 | 2:24 AM

ఓటరు జాబితాపై అవగాహన గ్రామసభ

28-08-2026 01:08 AM

- BLOల ఆధ్వర్యంలో ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన.. 

- 18 ఏళ్లు నిండిన యువత ఓటు నమోదు చేసుకోవాలి

కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలో అధికారులు, BLO ఆధ్వర్యంలో ఓటరు జాబితాపై అవగాహన, పరిశీలన కార్యక్రమానికి సంబంధించి గురు వారం గ్రామసభ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాలను పరిశీలించడంతో పాటు కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, అనర్హుల పేర్ల తొలగింపుపై గ్రామస్థులకు అధికారులు అవగాహన కల్పించారు. గ్రామసభలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలోని ఓటర్ల పేర్లను BLOలు గట్టిగా చదివి వినిపించారు.

జాబితాలో తమ పేరు, వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం Form-6, డిక్లరేషన్ ఫారం, అవసరమైన ఆధార పత్రాలను సమర్పించాలని కోరారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే Form-8తో పాటు ఆధార పత్రాలను సమర్పించి సవరణ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

నియోజకవర్గానికి చెందిన ఓటరు డిక్లరేషన్‌తో జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నట్లయితే Form-7 ద్వారా అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ, క్లెయిమ్‌లు, భారత ఎన్నికల సంఘం సూచించిన పత్రాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, 18 ఏండ్లు నిండిన యువతతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.