28 August, 2026 | 2:24 AM

అపరాజిత ప్రీతికి కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం

28-08-2026 01:11 AM

భూపాలపల్లి,(విజయ క్రాంతి): కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో విశేష పరిశోధనలు చేసిన పరిశోధకురాలు అపరాజిత ప్రీతి పి హెచ్ డి కి ఎంపికయ్యారు. బ్యాంకింగ్ రంగంలో మహిళా ఉద్యోగుల పనితీరు, వారి మానసిక సామర్థ్యాలపై ఆమె సమర్పించిన ప్రామాణిక పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి గాను విశ్వవిద్యాలయం ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అపరాజిత ప్రీతి "ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ వర్క్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ - ఏ స్టడీ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయీస్ ఇన్ సెలెక్ట్ బ్యాంక్స్" అనే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంపై తన పరిశోధనను పూర్తి చేశారు.

కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన సీనియర్ ఆచార్యులు ప్రొఫెసర్ పి. అమరవేణి మార్గదర్శకత్వంలో  ఆమె ఈ పీహెచ్‌డీ సిద్దాంత గ్రంథాన్ని పూర్తి చేసి విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ప్రీతి సమర్పించిన పరిశోధన నాణ్యతను గుర్తిస్తూ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ఖరారు చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. రాజేందర్ అధికారికంగా వెల్లడించారు. భూపాలపల్లి సింగరేణి సంస్థలో అధికారిగా విధులు నిర్వహిస్తున్న మనోజ్ కుమార్ సతీమణి ఈ అపరాజిత ప్రీతి.

వృత్తిపరమైన, కుటుంబ బాధ్యతలను సర్థుబాటు చేసుకుంటూనే, విద్యా రంగంలో అత్యున్నతమైన పీహెచ్‌డీ పట్టాను సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగినుల భావోద్వేగ సమతుల్యత  వారు ఎదుర్కొనే పని ఒత్తిడి, బ్యాంకింగ్ రంగంలో వారి పనితీరు మెరుగుదలకు ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు కొనియాడారు. ఉన్నత విద్యలో డాక్టరేట్ సాధించిన అపరాజిత ప్రీతిని, ఆమె భర్త మనోజ్ కుమార్‌ను సింగరేణి సహచర అధికారులు, కేయూ అధ్యాపక బృందం, తోటి పరిశోధకులు బంధుమిత్రులు  అభినందించారు.