21 July, 2026 | 11:21 PM

Breaking News

ఘనంగా ఆంజనేయుడి జయంతి

02-06-2024 12:05 AM

యాదాద్రి భువనగిరి, జూన్ 1 (విజయక్రాంతి) : యాదాద్రి కొండపై వెలిసిన లక్ష్మీనర్సింహుడి క్షేత్రపాలకుడు ఆంజనేయుడి జయంతి వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. కొండపై విష్ణు పుష్కరిణి ఆంజనేయస్వామి ఆలయంలో విశ్వక్సేనారాధనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. వేదమంత్రాలతో స్వస్తివాచనం, స్నపాన ఆరాధన చేశారు. ఆంజనేయస్వామికి మన్యసూక్త పారాయణాలతో పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.

లక్ష నాగావళి దళపత్రాలతో సమస్ర నామార్చన చేశారు. అదే విధంగా ప్రధానాలయంలో పాతగుట్ట ఆలయ పుష్కరిణీ వద్ద ఆంజనేయస్వామి ఆలయాల్లో శాస్త్రోక్తంగా స్వామివారి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగల్ లక్ష్మీనర్సింహాచార్యు లు, సిద్ధాంతి గౌరీబట్ల సత్యనారాయణ సిద్ధాంతి, వేదపండితులు కృష్ణామాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం, వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ ఈవో భాస్కర్‌రావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

స్వామివారికి నిత్య కల్యాణం

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామికి శనివారం నిత్య కల్యాణం ఘనంగా నిర్వహించారు. పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో అలంకరించిన స్వామివారిని గజ వాహనంపై ఊరేగిస్తూ ఉత్సవ మండపంలో కల్యాణ వేదికపై అధిష్టింప చేశారు. పాంచరాత్రగమ శాస్త్ర పద్ధతిలో నిత్యకల్యాణం జరిపారు. అంతకుముందు సుదర్శన హోమం జరిపారు. వేకువ జామున సుప్రభాత సేవ, బాలబోగం, అభిషేకం, అర్చనలు, అష్టోత్తర పూజలు జరిపారు. సాయంత్రం లక్ష్మీనర్సింహుల వెండిజోడి సేవను తిరువీధుల్లో ఊరేగించారు. శనివారం యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల నుంచి స్వామివారికి  రూ. 50,89,865 ఆదాయం సమకూరింది.