పారిశ్రామిక అడ్డాగా జహీరాబాద్!
నిమ్జ్ ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం
12,635 ఎకరాల్లో పారిశ్రామిక మండలి
వడివడిగా సాగుతున్న భూముల సేకరణ
నిమ్జ్‌తో 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
భూసేకరణపై కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష
సంగారెడ్డి, జూన్ 1 (విజయక్రాంతి): జహీరాబాద్‌లో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్) ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. ఇందుకు అవసరమైన భూమిలో ఇప్పటికే 4వేలకుపైగా సేకరించగా, తాజాగా మరోసారి భూముల సేకరణపై దృష్టిసారించారు. సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాలతో భూముల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఝరాసంగం, న్యాల్‌కల్ మండలంలో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలిని ఏర్పాటుకు 17 గ్రామాల్లో 12,635.14 ఎకరాల భూమి సేకరణ లక్ష్యంగా సర్వే కొనసాగుతోంది. న్యాల్‌కల్, ఝరాసంగం మండలంలో 4426.12 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు. న్యాల్‌కల్ మండలం ముంగి, రుక్మాపూర్, ఝరాసంగం మండలం బర్థీపూర్, చిలేపల్లి, ఎల్గోయి గ్రామాల్లో కొంత సేకరణ పూర్తయింది. తాజాగా కలెక్టర్ ఆదేశాలతో తిరిగి భూ సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు.
4.5లక్షల మందికి ఉద్యోగావకాశాలు!
చైనాలోని పారిశ్రామిక మండలి తరహాలో జహీరాబాద్‌లో ఏర్పాటు కాబోతున్న నిమ్జ్‌లో 4.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. రూ.40వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నేషనల్ మానుఫ్యాక్చరింగ్ పాలసీలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. 2011లో భూసేకరణ ప్రారంభించగా అవసరం మేరకు ఇంకా కొనసాగుతోంది.
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో..
ఇక్కడ ఏర్పాటు కాబోతున్న నిమ్జ్‌లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పరిశ్రమలు నెలకొల్పనున్నారు. ఇందుకు అవసరమైన భూమిలో 31 శాతం ప్రభుత్వ నిధి, 69 శాతం భూమి ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ ప్రకారం సేకరిస్తున్నారు. ఆటో మొబైల్స్, ఆటో కాంపోనెంట్స్, జౌళి, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, రబ్బర్, ప్లాస్టిక్, ఎలక్ట్రిక్ యంత్రాలు, పుడ్ ప్రాసెసింగ్ ఉత్పాదక పరిశ్రమలతోపాటు సాంకేతిక పరంగా ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్లు, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్, టెక్నికల్ శిక్షణ కేంద్రాలు కూడా నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. 2040 వరకు పరిశ్రమల జోన్‌గా నిమ్జ్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. అందులో భాగంగా రైలు మార్గం, 65వ జాతీయ రహదారుల పునరుద్ధరణ, కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.5,200 కోట్లు అంచనా వేయగా, హుగ్గెల్తి చౌరస్తా నుంచి ఎల్గొయి శివారు వరకు రూ.100 కొట్లతో రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. మౌళిక సదుపాయాలకు రూ. 884 కోట్లు, ప్రణాళిక అధ్యయనం కోసం రూ.15 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవలే నివేదిక సమర్పించింది. నివేదిక ఇచ్చింది.
ముందుకొస్తున్న పలు కంపెనీలు..!
నిమ్జ్‌లో సంస్థల ఏర్పాటు కోసం పలు కంపెనీలు ఇప్పటికే ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ట్రైటాన్ రూ.2100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పుం దం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. జర్మనీకి చెందిన లైట్ ఆటో రూ.1500 కోట్ల పెట్టుబడులతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వేమ్ టెక్నాలజీస్ రూ. 1000 కోట్లతో పెట్టుబడులు పెట్టనుండగా 2022 జూన్ 22న అప్పటి మంత్రి కేటీఆర్ భూమి పూజ కూడా చేశారు.
రైతులకు పరిహారం..
నిమ్జ్ ఏర్పాటుకు భూసేకరణ వేగవంతం చేయలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. బుధవారం జహీరాబాద్‌లోని నిమ్జ్ కార్యాలయంలో రెవెన్యు, నిమ్జ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ కోసం కోర్టులో ఉన్న కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, భూ నిర్వాసిత రైతులకు పరిహారం కింద రూ.54కోట్లు విడుదలైనట్లు తెలిపారు.






