వైభవంగా శ్రీ బాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వెలసిన శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా, కనులపండువగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణ కార్యక్రమానికి తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పర్యవేక్షకులుగా వ్యవహరించి కళ్యాణవేడుకను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచే ఆలయంలో విశేష పూజలు ప్రారంభమయ్యాయి.
లోక కళ్యాణార్థం స్వామివారికి శాంతికల్యాణం, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. కళ్యాణ వేడుక అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకను వీక్షించేందుకు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగింది.




