బిల్లుపాడు పాఠశాలలో ఘనంగా ఫేర్‌వెల్ వేడుకలు
కల్లూరు/తల్లాడ,ఏప్రిల్ 22 (విజయక్రాంతి): తల్లాడ మండలం బిల్లుపాడు ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం జి.సరోజిని ఆధ్వర్యంలో ఫేర్వెల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ దామోదర ప్రసాద్,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జోసెఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య ప్రతి ఒక్కరికి అవసరమని,పంచిన కొద్దీ పెరిగేది విద్యేనని పేర్కొన్నారు.చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలని,సంస్కారం లేని చదువు వ్యర్థమని తెలిపారు.
బాగా చదివే పాఠశాలల్లో బిల్లుపాడు పాఠశాల ఒకటని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రశంసించినట్లు చెప్పారు.ప్రపంచంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది విద్యేనని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు పెద్దపెద్ద ఉద్యోగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలియజేశారు. రాబోయే జూన్ 12 నుండి పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, టై, బెల్ట్, షూస్తో పాటు విద్యా సామాగ్రి, టిఫిన్, పాలు వంటి సుమారు 25 రకాల విద్యా సామగ్రిని అందించేలా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సెలవుల సమయంలో విద్యార్థులు బయటకు వెళ్లకుండా తల్లిదండ్రుల సమక్షంలోనే ఉండాలని,మంచి పుస్తకాలు చదవాలని సూచించారు. తల్లిదండ్రులకు తెలియకుండా చెరువులు,బావులు,కుంటల్లో ఈతకు వెళ్లరాదని హెచ్చరించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. వీడ్కోలు కానుకగా విద్యార్థులకు వాటర్ బాటిళ్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.ఫ్రాన్సిస్,జి.నాగమణి,ఎం. కళావతి,విద్యార్థులు,తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.






