18-11-2025 12:40:26 AM
మహబూబాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణలో ఏకశిల పదునెట్టంబడి కలిగి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం శ్రీ ధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో సోమవారం మండల కాల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మండల కాల ఉత్సవాల పూజలో భాగంగా సోమవారం ఉదయం ఏడు గంటలకు కుడిఎట్టం (ధ్వజారోహణం)తో ప్రధాన తాంత్రి విష్ణు నారాయణ పొట్టి ప్రారంభించారు.
అయ్యప్ప ఆలయంలో మండల కాల పూజలు వచ్చే నెల 27 వరకు కొనసాగుతాయి. దీనిలో భాగంగా డిసెంబర్ 7న నగర సంకీర్తన, పంబ ఆరాట్టు, అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
డిసెంబర్ 24న ప్రత్యేక నైవేద్యశుద్ధి భింబశుద్ధి ఆలయ శుద్ధి, 25న ఉదయం 7 గంటలకు మహా మృత్యుంజయ హోమం, మహా సుదర్శన హోమం మహా కుబేర హోమం, 26న మహా గణపతి హోమం, అష్ట కలశపూజ, వాస్తుబలి, వాస్తు పూజ, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణము, 27న ఉదయం ఎనిమిది గంటలకు సహస్ర కలశాభిషేకం, సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు మహా పడిపూజ, అనంతరం అగ్ని గుండాల కార్యక్రమం, మండల పూజ ఉత్సవాల ముగింపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మండల కాల పూజా కార్యక్రమాలు, 45 రోజులపాటు నిర్వహించే మహాన్నదాన ప్రారంభ కార్యక్రమంలో కేసముద్రం తహసిల్దార్ వివేక్, కేసముద్రం సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ క్రాంతి కిరణ్, వివిధ పార్టీల నాయకులు అల్లం నాగేశ్వరరావు, మర్రి నారాయణరావు, రావుల మురళి, జాటోత్ హరి నాయక్, వీరు నాయక్, తరాల వీరేష్ ఆలయ కమిటీ బాధ్యులు వోలం చంద్రశేఖర్, పోలేపల్లి యాకుబ్ రెడ్డి, బోగోజు నాగేశ్వరచారి, గురు స్వాములు తరాల సంపత్, వేముల వెంకటేశ్వర రెడ్డి , పెరుమాళ్ళ ఎల్లా గౌడ్, జనగాం వెంకట్ గౌడ్, రుద్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.