28 February, 2026 | 4:22 AM

నామినేటెడ్ పోస్టులు ఇంకెప్పుడు?

28-02-2026 02:33 AM

ఉగాదికి ముందైనా తీపి కబురు వచ్చేనా!

ఎదురుచూపుల్లో ఆశావహులు 

అదిగో ఇదిగో అంటున్న కాంగ్రెస్ అధిష్ఠానం 

35 నుంచి 40 వరకు ఖాళీగా పోస్టులు 

మొదటి విడతలో ఒక్క సామాజికవర్గానికే పెద్దపీట

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : అధికార కాంగ్రెస్‌లో  నామినే టెడ్ పోస్టుల భర్తీ పరిస్థితి అదిగో పులి.. ఇదిగో తోక అన్నట్లుగా ఉంది. త్వరలోనే తీపి కబురు ఉంటుందని.. ఆ పండుగ, ఈ పండుగ అంటున్న పార్టీ అగ్రనాయకత్వం చెబుతున్న మాటలు నీటి మూట లే అవుతున్నాయని, పదవుల పందెరం మాత్రం జరగడం లేదు. దసరా.. దీపావళి.. సంక్రాంతి పండుగలంటూ పెట్టిన వాయిదాలు కూడా దాటిపోయాయి.

గ్రామాల్లో సర్పంచ్, పట్టణాల్లో పురపాలికల ఎన్నికలు కూడా ముగిశాయి. ఇక వచ్చే ఉగాది పండుగకు ముందైనా పదవులు రుచి చూపిస్తారా? లేదంటే మళ్లీ మొండి చెయ్యేనా? అనే చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాలం పూర్తయినా నామినేటెడ్ పదవులను భర్తీ చేయలేదనే నిరాశ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2024 జూన్‌లో మెదటి విడతలో 37 మందితో వివిధ కార్పోరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది.

ఆ తర్వాత కూడా మరికొంద రిని నియమించారు. ఇప్పుడు వారి పదవీకాలం కూడా పూర్తి కావస్తోంది. రెండో విడతలో 35 నుంచి నుంచి 40 నామినేటెడ్ పదవులను  నియమించాలని గత రెండేళ్లుగా డిమాండ్ ఉన్నా..  ప్రభుత్వం భర్తీ చేయకుండానే నాన్చుతుందనే విమర్శలు ఉన్నాయి.  ఖాళీగా ఉన్న  ఈ పదవుల కోసం ఆర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతుందని, రెండేళ్లుగా ఎదురుచూస్తున్న తమ కళ్లు కాయలు కాస్తున్నాయనే ఆవేదన ఆశావాహుల్లో వ్యక్తమవుతోంది. 

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించినవారికి పోటీచేసే అవకాశం రాకపోవడంతో, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని పార్టీ నేతలు అప్పుడు  హామీ ఇచ్చారు. అంతేకాకుండా మరి కొందరు పార్టీ కోసం కష్టపడుతూ ఏదో ఒక ఛాన్స్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లాల పర్యటన సందర్భంగా.. పార్టీలో బలమైన నాయకులకు అధికారంలోకి వచ్చాక న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

ఇప్పుడు వారం తా పార్టీలో పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలనే జిల్లా కాంగ్రెస్ కమిటీలు, మరికొన్ని నగర కాంగ్రెస్ కమిటీలను కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తిచేసింది. స్థానికంగా మార్కెట్ కమిటీల పాలకవర్గాలను కూడా నియమించింది. పదవులు దక్క ని నేతలు, పార్టీ పదవులపై గంపెడాశలు పెట్టుకు న్న నేతలకు ఊరటనిచ్చేలా వివిధ కార్పోరేషన్ పదవులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్  పార్టీ అధిష్ఠానానికి పలుమార్లు కలిసి గట్టిగానే సిఫారసు చేశారు.

డీసీసీ పదవుల నియామకం తర్వాత మీ నాక్షి నటరాజన్ చేపట్టిన జిల్లాల పర్యటనలో ఆశావాహులు నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఈ విజ్ఞప్తుల ఆధారంగానే పదవుల ఆశిస్తున్న వారి జాబితాను  ఏఐసీసీ పెద్దలకు  మీనాక్షి నటరాజన్ ఒక నివేదిక సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రం, జిల్లా స్థాయి నామినేటెడ్  పోస్టుల భర్తీ కోసం ప్రతి జిల్లా నుంచి ఐదు నుంచి ఆరుగురి పేర్ల జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలిసింది.

అయితే, కొందరు ఎమ్మెల్యేలకు కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఇస్తారనే ప్రచారంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ప్రధానంగా ఆర్టీసీ, మూసీ సుందరీకరణ, హౌసిం గ్, పరిశ్రమల అభివృద్ధి, ఎక్సైజ్ వంటివాటిని ఇస్తారన్న ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమ వుతున్న ది. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వారికి పార్టీ, ప్రభుత్వ పదవులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీచేసే అవకాశం కల్పించా రని, కానీ కాంగ్రెస్ హయాంలో ఓయూ నేతలకు అవకాశం ఇవ్వడంలేదనే విమర్శ కూడా ఉంది. 

సామాజిక న్యాయం ఉంటుందా? 

మొదటి విడతలో చేపట్టిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయం పాటించలేదనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 37 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వగా బీసీలకిచ్చిన పదవుల్లో కనీసం 20 శాతం కూడా దాటలేదు. ఇక ఎస్సీలకు కేవలం ఎస్సీ కార్పోరేషన్ పదవి మాత్రమే ఇచ్చారు. ఎస్టీలకు ఒకరిద్దరికి మాత్రమే నామినేటెడ్ పదవులు కల్పించారు.

అయితే ఓసీల్లో మాత్రం ఒక సామాజికవర్గానికి పెద్దపీట వేశారు. రెండో విడత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే.. సామాజిక న్యాయం పాటిస్తారా? లేదంటే గంపగుత్తగా ఒకటి, రెండు వర్గాలకే పెద్దపీట వేస్తారా? అనే చర్చ జరుగుతోంది. మొదటి విడతలో జరిగిన తప్పిదం, రెండో విడతలోనూ జరిగితే కాంగ్రెస్‌కు భవిష్యత్తులో ఇబ్బందులేనని పార్టీవర్గాలు చెబుతున్నాయి.