18-11-2025 12:42:15 AM
రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
కాకతీయ యూనివర్సిటీ, నవంబర్ 17 (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయానికి పెండింగ్లో ఉన్న పెన్షన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కుర్టా ప్రతినిధులు, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కుర్టా అధ్యక్షులు ప్రొఫెసర్ ఏ. సదానందం మాట్లాడుతూ ఇటీవల ఆర్థిక శాఖ ఆదేశాల ప్రకారం విశ్వవిద్యాలయాలు జీతాలు పెన్షన్లకు వేర్వేరు బిల్లులు పంపాలని సూచించడం వల్ల, జీతాల బిల్లులు క్లియర్ అవుతున్నప్పటికీ, పెన్షన్ బిల్లులు గత కొన్ని నెలలుగా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. ఇప్పటికే పరిమిత వనరులతో నడుస్తున్న విశ్వ విద్యాలయంపై అదనపు భారం పడుతోందని ఉప ముఖ్యమంత్రి కి వివరించినట్లు చెప్పారు.
సమస్యను శ్రద్ధగా విని, పరిస్థితి యొక్క తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకుని, ప్రతినిధి బృందానికి ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ అకౌంటింగ్ నిబంధనల ప్రకారం జీతం బడ్జెట్లో పెన్షన్ కూడా అంతర్భాగమే అని అసోసియేషన్ ఇచ్చిన వివరణను ఉప ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలిపారు.
ఈ కీలకమైన సమావేశం జరిగేందుకు ప్రత్యేకంగా ముందడుగు వేసిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి, సమస్య పరిష్కారానికి సానుకూలత వ్యక్తపరిచిన ఉప ముఖ్యమంత్రి కి అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎం. ఎర్రగట్టు స్వామి, ప్రొఫెసర్ వి. రవీందర్, ప్రొఫెసర్ జి. వీరన్న, ప్రొఫెసర్ కె. వెంకటనారాయణ, ప్రొఫెసర్ ఈ.రామరెడ్డి పాల్గొన్నారు.