18-11-2025 12:36:09 AM
భక్తుల ప్రత్యేక పూజలు, భజనలు
వెంకటాపూర్(రామప్ప), నవంబర్17(విజయక్రాంతి):కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయంలో సోమవారం భక్తులు పోటెత్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడ్డారు.
ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు శివలింగానికి అభిషేకాలు, అలంకారాలు, ప్రత్యేక ఆర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కమీషనర్ దేవాదాయ, ధర్మాదాయ హైదరాబాద్ వారి ఉత్తర్వుల మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి బిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తి గీతాల భజన కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు పాల్గొని భక్తి గీతాలను ఆలపించారు.
ఆలయ ప్రాంగణంలో భక్తి మయంగా భజనలు, శివుని నామస్మరణం సందడి చేసింది. స్వామివారి సన్నిధిలో భక్తులు దీపారాధన చేస్తూ తమ కోరికలు తీర్చమని వేడుకున్నారు. కార్తీక సోమవారం కావడంతో భక్తుల రద్దీ సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువగా కనిపించింది. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టూరిజం పోలీసులు విధులు నిర్వహించారు. కార్తీక మాసం ముగింపు వేళ రామప్పలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిబ్బందీలు, టూరిస్ట్ పోలీసులు, గైడ్స్, భక్తులు పాల్గొన్నారు.