5 July, 2026 | 2:25 AM

ఖమేనీ చెంతనే మనుమరాలి శవపేటిక

05-07-2026 12:00 AM
  1. ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో విషాదకరమైన దృశ్యం
  2. కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు
  3. టెహ్రాన్‌లో రెండోరోజు లక్షలాది మంది నివాళి

టెహ్రాన్, జూలై 4: ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతండడంతో ఆ దేశం అంతా ప్రస్తుతం విషాదఛాయలు అలుముకున్నాయి. ఖమేనీ భౌతికకాయం పక్కనే ఉంచిన 14 నెలల తన మనమరాలు శవపేటిక అందరి హృదయాలను కదిలిస్తోంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఖమేనితోపాటు యుద్ధంలో మరణించిన వారిని గుర్తుచేసుకుంటూ ఇరానీయులంతా శోకసంద్రంలో మునిగిపోతు న్నారు.

శుక్రవారం ప్రారంభమైన అంత్యక్రియల కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి వచ్చిన వారంతా ఖమేనీకి నివాళులర్పించారు. రెండో రోజైన శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మందిరంలో ఖమేనీ భౌతికకాయాన్ని ఉంచారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది తరలివచ్చి, నివాళులు అర్పించారు. ఫిబ్రవరి 28న అమెరికా సంయుక్త దాడుల్లో చనిపోయిన అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు శుక్రవారం టెహ్రాన్‌లో ప్రారంభమయ్యాయి.

ఈ అంత్యక్రియల ఊరేగింపు ఆరు రోజుల పాటు టెహ్రాన్ నగరం నుంచి దేశవ్యాప్తంగా కొనసాగనుంది. షియా పవిత్ర నగరాలైన ఖోమ్, నజాఫ్, కర్బాలా మీదుగా యాత్ర సాగుతుంది. చివరగా ఈ నెల 9న మషద్ నగరంలో ఖమేనీ ఖననంతో అంత్యక్రియలు పూర్తవుతాయి. మరోపక్క  అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ఇరాన్ ప్రజలపై ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే, ప్రజలు ఖమేనీకి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.

ఇంత భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ అత్యున్నత నాయకుడిగా ఉన్న మొజ్తాబా ఖమేనీ మాత్రం ఈ అంత్యక్రియల్లో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇజ్రాయెల్ నుంచి ఉన్న భద్రతా ముప్పు, నిఘా చర్యల నేపథ్యంలో ఆయన హాజరు కావడం లేదని మొజ్తాబా ప్రతినిధి అయతల్లా హకీమ్ ఎలాహీ తెలిపారు. 

కలచివేసిన  చిన్నారి శవపేటిక ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఒక చిన్న శవపేటిక అందరినీ కలచివేసింది. ప్రభుత్వ లాంఛనాలు, రాజకీయ ప్రసంగాల మధ్య ఆ చిన్నారి వీడ్కోలు దృశ్యం అత్యంత భావోద్వేగాలను నింపుతోంది. ఖమేనీ పార్థివదేహం పక్కనే ఆయన 14 నెలల మనమరాలు జహ్రా మొహమ్మది గొల్పయోగాని శవపేటికను ఉంచారు.

ఒకే కుటుంబంలో జరిగిన ఈ ఘోర నష్టం యుద్ధం తెచ్చిన మానవత్వ నష్టాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తోంది. అధికారిక సంతాప దినాల నేపథ్యంలో నల్లటి దుస్తులు ధరించిన వేలాది మంది ప్రజలు అక్కడికి తరలివచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు పలువురు కుటుంబ సభ్యులు మరణించారు. ఈ వీడ్కోలు వేడుకలో విప్లవాత్మక నినాదాలు, సైనిక గౌరవాలు హోరెత్తాయి.