5 July, 2026 | 2:26 AM

సియా, చేతన్ లై డిటెక్టర్ టెస్ట్‌కు కోర్టు నో

05-07-2026 12:00 AM

నిందితుల సమ్మతిలేనిదే నిర్వహించొద్దని పోలీసులకు ఆదేశం

ముంబై, జూలై 4 (విజయక్రాంతి): పుణె కేతన్ అగర్వాల్ హత్యకేసులో దర్యాప్తును వేగవంతం చేసేందుకు భావిస్తున్న పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. నిందితులైన సియా, చేతన్‌లకు పాలిగ్రాఫ్ టెస్ట్ (లై డిటెక్టర్) నిర్వహించేందుకు అనుమతించాలని శనివారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ టెస్టుకు నిందితులు అంగీకరించలేదు.

వారి సమ్మతిలేకుండా ఈ పరీక్షను నిర్వహించవద్దని కోర్టు పోలీసులకు స్పష్టం చేసింది. నిందితులు అంగీకరిస్తే తప్ప అనుమతివ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. సియా, చేతన్‌ల ఫోన్‌లలో ఉన్న మెసేజ్‌లను పోలీసులు జల్లెడ పట్టారు. ఇందులో జరగని పెళ్లి కోసం టికెట్లు బుక్ చేస్తున్నానంటూ సియా చేతన్‌తో పేర్కొన్నట్లు గుర్తించారు.

దీన్ని బట్టిచూస్తే సియా కేతన్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిందని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ కేసులో చేతన్ స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సియా దాచిన మరోఫోన్‌ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.