14 May, 2026 | 12:09 PM

చెంచు మహిళపై పాశవిక దాడి!

21-06-2024 12:30 AM
  • పచ్చికారం, డీజిల్ చల్లి శరీర భాగాలు, జననాంగాలకు నిప్పు
  • ఫిల్టర్ ఇసుక తయారీ కోసం కుటుంబంతో వెట్టిచాకిరీ
  • నాగర్‌కర్నూల్ జిల్లాలో అమానవీయ ఘటన
  • పోలీసుల అదుపులో నిందితులు 

నాగర్‌కర్నూల్, జూన్ 20 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ చెంచు మహిళపై ముగ్గురు వ్యక్తులు పాశవికంగా దాడికి తెగబడ్డారు. సుమారు పది రోజులుగా ఇంట్లోనే బంధించి జననాంగాలపై పచ్చికారం, డీజిల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం మొలచింతలపల్లి గ్రామం భ్రమరాంబిక కాలనీలో గురువారం వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మొలచింతలపల్లి గ్రామానికి చెందిన కాట్రోజు ఈదన్న దంపతులు. ఇద్దరూ అదేగ్రామానికి చెందిన బండి వెంకటేశ్ వద్ద ఇసుక తయారీలో పనిచేస్తున్నారు.

ఈశ్వరమ్మ అక్క, బావలు కూడా వారి వద్దే పనిచేస్తున్నారు. ఏళ్లుగా వెంకటేశ్ వద్దనే ఫిల్టర్ ఇసుక తయారీ కోసం వెట్టిచాకిరీ చేస్తున్నా.. తిండి, వైద్యం ఖర్చులకు కూడా సరిపడా జీతం ఇవ్వకపోవడంతో ముగ్గురు పిల్లలను పోషించడం ఇబ్బందిగా మారి ఇతర పనిచేసుకోవాలని ఈశ్వరమ్మ నిర్ణయించుకుంది. ఇదే విషయమై భర్తతోనూ గొడవపడింది. విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన ఇసుక వ్యాపారి బండి వెంకటేశ్ అతడి భార్య శివమ్మ, తమ్ముడు శివుడు ముగ్గురూ కలిసి ఈదన్నకు తెలియకుండా ఈశ్వరమ్మను ఇంట్లోనే బంధించి, పైశాచిక దాడికి తెగబడ్డారు. పదిరోజులుగా చిత్రహింసలకు గురిచేశారు.

అందుకు ఈశ్వరమ్మ అక్క, బావల సాయం తీసుకున్నారు. వివస్త్రను చేసి చేతులు, కాళ్లు కట్టేసి పచ్చికారాన్ని జననాంగాలపై రుద్దారు. డీజిల్ పోసి నిప్పంటించారు. దీంతో ఈశ్వరమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న భర్త ఈదన్న గ్రామస్తుల సాయంతో పోలీసులను ఆశ్రయించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈశ్వరమ్మను జిల్లా ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ శ్రీనివాసులు విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

మంత్రి జూపల్లి సీరియస్

ఈ ఘటపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిందితులను చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్‌కు ఫోన్‌లో ఆదేశాలిచ్చారు. బాధిత మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.