పరిహారం తర్వాతే ఖాళీ చేయించాలి
- భూములు కోల్పోయిన రైతులకు పునరావాసం కల్పించాలి
- అనంతగిరి రిజర్వాయర్ భూసేకరణపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్ నిమిత్తం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అనంతగిరిలో సేకరించిన వ్యవసాయ భూముల నుంచి రైతులను ఖాళీ చేయించరాదని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతులకు ఆరు వారాల్లో పునరావాస ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు రైతులను వ్యవసాయ భూముల నుంచి ఖాళీ చేయించరాదని ఇటీవల తీర్పు చెప్పింది. చట్టప్రకారం పునర్నిర్మాణ, పునరావాస ప్రయోజనాలను కల్పించాలని ఆదేశించింది.
అనంతగిరి రిజర్వాయర్ నిమిత్తం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భూసేకరణను సవాలు చేస్తూ సీహెచ్ లక్ష్మారెడ్డి సహా పలువురు రైతులు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల తీర్పు చెప్పారు. పిటిషనర్ లాయర్ వాదిస్తూ అనంతగిరిలో రిజర్వాయర్ కోసం 60 ఎకరాలు, ఇతర చోట్ల 257 ఎకరాల భూసేకరణ జరిపేందుకు 2017 జనవరి 1న, మే 16న అధికారులు ప్రాథమిక నోటిఫికేషన్ వెలువరించారని వివరించారు. అంతకుముందు భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడంపై కొందరు రైతుల అభ్యంతరాలను కలెక్టర్ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. విధానపర తప్పుల్ని ప్రశ్నించినందుకు బెదిరింపులు, ఒత్తిళ్లను రైతులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు.
కనీసం అవార్డు ప్రకటించే ముందు వ్యక్తం చేసిన పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. అధికారులు చెప్పిన పరిహారాన్ని తీసుకున్నాక దాన్ని మరింత పెంచాలనే రైతుల వినతులను, అభ్యంతరాలను భూసేకరణ అథారిటీకి పంపాలని కోరినా చర్యలు శూన్యమన్నారు. ఇప్పటివరకు పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలు కల్పించకుండా పిటిషనర్ల పక్క భూముల్లో పనులు మొదలుపెట్టారని చెప్పారు పిటిషనర్లు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అనంతగిరి గ్రామంలో 69 ఎకరాలు, రేపాక గ్రామంలో 3,522 ఎకరాలు, ఆవార్డు ప్రకటించి పరిహారం చెల్లించారని, ఈ భూముల్లో అనంతగిరి రిజర్వాయర్ బండ్ భాగాన్ని పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
పునరావాస పునర్నిర్మాణంలో భాగంగా 599 నిర్మాణాలకు పరిహారం చెల్లించినట్లు తెలిపారు. 2018 జనవరిలో గ్రామసభ నిర్వహించామని, ఆర్‌అండ్‌ఆర్ చట్టం కింద ప్రతిపాదనలు సిద్ధం చేయగా కమిషనర్ ఆమోదించారని, ప్రభుత్వం జీవో 1045 జారీ చేసిందన్నారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గతంలో పరిహారం చెల్లించిన భూములను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, పునరావాసం, పరిహారం చెల్లించామని అధికారులు చెబుతున్నప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలు చూపలేదని తప్పుపట్టింది.
సేకరించిన భూములకు పునరావాసం ప్రయోజనాలు కల్పించేదాకా భూముల నుంచి రైతులను ఖాళీ చేయించరాదని 2018లో ఇదే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అయినా అధికారులు వాటిని ఉల్లంఘించడంతో కోర్టు దిక్కరణ కింద కోర్టు శిక్ష విధించిందని తెలిపింది. ఆ ఉత్తర్వులు ఇప్పటికే అమల్లో ఉన్నందున పరిహారం చెల్లించేదాకా వారిని ఖాళీ చేయించరాదని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. తమ తీర్పు ప్రతి అందిన ఆరువారాల్లో అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బౌరంపేట భూములపై వివరాలివ్వండి
రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం బౌరంపేటలో 10 ఎకరాల ప్రభుత్వ భూముల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు నిర్మాణ సంస్థ ఆక్రమణలతో సహా అన్ని వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. బౌరంపేట గ్రామంలోని సర్వే నెం.166లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని వజ్ర బిల్డర్లు, ఇతర ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుని లేఅవుట్ వేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన జీ రఘువీర్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.
రాఘవరావు అనే వ్యక్తికి ఉన్న 10 ఎకరాలకు సర్వే నెం.166లో అంతర్గత నంబర్లు వేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని పిటిషనర్ న్యాయవాది ప్రతీక్‌రెడ్డి చెప్పారు. రెవెన్యూ అధికారులు ఒక ఎమ్మెల్యేతో కుమ్మక్కై నిర్మాణ సంస్థ, ప్రైవేటు వ్యక్తులకు సహకరించారన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ పూర్తిస్థాయిలో కౌంటరు దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలని కోరారు. ప్రస్తుతం ఈ భూముల్లో 80 మంది దాకా ఉన్నారని, వారందరినీ ప్రతివాదులుగా చేయాల్సిన పరిస్థితులున్నాయన్నారు. అందువల్ల పూర్తి వివరాలు సమర్పించడానికి కొంత గడువు కావాలని కోరడంతో ధర్మాసనం అనుమతిస్తూ విచారణను జులై 2వ తేదీకి వాయిదా వేసింది.
లా కోర్సు అడ్మిషన్లలో జాప్యమెందుకు?
వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): న్యాయ విద్య కోర్సుల అడ్మిషన్లలో జరుగుతున్న జాప్యంపై వివరణ ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ కన్వీనర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే నోటీసులు జారీ అయినందున ప్రభుత్వాన్ని వివరణ కోరింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖను ఆదేశించింది. 2024 విద్యాసంవత్సరంలో లా డిగ్రీ కోర్సుల అడ్మిషన్లలో జాప్యంపై న్యాయవాది భాస్కర్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ న్యాయ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే కౌంటరు దాఖలు చేయగా విద్యాశాఖకు అదనపు సమయం ఇవ్వాలని అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ కోరారు. దీంతో విచారణ ఈనెల 27కు వాయిదా పడింది.






