పనులు పరిగెత్తించేలా..
- రాజీవ్ రహదారి కారిడార్ పనులు షురూ
- ఇప్పటికే మార్కింగ్ చేసిన హెచ్‌ఎండీఏ
- విద్యుత్ లేన్ల సర్ధుబాటుకు అధికారుల పరిశీలన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమ య్యాయి. ఈ రహదారిలో ఇప్పటికే ఉన్న 10 మీటర్లు రోడ్డును 60 మీటర్లకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,232 కోట్ల బడ్జెట్ కేటాయించగా, మార్చి నెలలో సీఎం రేవంత్ రెడ్డి కారిడార్ పనులకు శంకుస్థాపన చేశారు. పనులకు సంబంధించి ఇప్పటికే హెచ్‌ఎండీఏ అధికారులు మార్కింగ్ చేయగా, పనులను మరింత వేగవంతం చేసేందుకు మార్కింగ్‌కు అనుగుణంగా ప్రస్తుతం రహదారిపై ఉన్న విద్యుత్ సంబంధిత లేన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్ స్టేషన్లను రీప్లేస్‌మెంట్ చేయనున్నారు.
ట్రాఫిక్ తిప్పలు తప్పేందుకు..
హైదరాబాద్ ప్రధాన రహదారి అయిన రాజీవ్ రహదారి (స్టేట్ హైవే 1) నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో ప్రతి రోజూ 58 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని అధికారుల అంచనా. ముఖ్యంగా కార్ఖానా సమీపంలో ఈ సంఖ్య 81 వేలకు పైగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా, ఓఆర్‌ఆర్ జంక్షన్ వద్ద 35 వేలకు పైగా వాహనాలు మాత్రమే పయనిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో సికింద్రా బాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఓఆర్‌ఆర్ శామీర్‌పేట దాకా వాహనదారులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు అధికారులు ప్రణాళికలు రచించారు. ఈ కారిడార్ నిర్మాణంతో ట్రాఫిక్ తిప్పలు తప్పడంతో పాటు వాహనదారులకు ఇంధనానికి అయ్యే వ్యయం కూడా తగ్గనుంది.
11 కిలోమీటర్లు.. 6 లేన్లు
ఈ రోడ్డులో సులువుగా ప్రయాణం చేసేందుకు రాజీవ్ రహదారిని 6 లేన్లుగా విస్తరించనున్నారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట, తూంకుంట మీదుగా ఓఆర్‌ఆర్ శామీర్‌పేట దాకా ఈ రోడ్డును సుమారు 11 కిలో మీటర్లకు పైగా, 6 లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. అందుకు మొత్తం 287 స్తంభాలతో ఈ కారిడార్‌ను నిర్మించనున్నారు. మొత్తం 197 ఎకరాల భూ సేకరణ అవసరం ఉండగా, అందులో 113 ఎకరాలు రక్షణ శాఖకు చెందినదిగా, మిగతాది ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ రహదారి పూర్తయితే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు రాకపోకలకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి.
విద్యుత్ లేన్ల రీప్లేస్‌మెంట్‌కు
ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా ప్రస్తుత రహదారిలో విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ లేన్లు రీప్లేస్‌మెంట్ చేయనున్నారు. దీంతో హెచ్‌ఎండీఏ, విద్యుత్ శాఖ లైన్స్, విద్యుత్ మాస్టర్‌ప్లాన్ అధికారులు గురువారం కారిడార్ ప్రాంతాన్ని పరిశీలించారు. విద్యుత్ లేన్లను మార్కింగ్‌కు వెలుపల తిరిగి ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖకు అయ్యే ఖర్చును హెచ్‌ఎండీఏ చెల్లించనుంది. ఈ లేన్లలో ఉన్న 33, 11 కేవీ లేన్లతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు, 2 సబ్ స్టేషన్లను రీప్లేస్‌మెంట్ చేయాల్సి వస్తుందంటూ అధికారులు చెబుతున్నారు. అందుకు ముందుగా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లేన్ల రీప్లేస్‌మెంట్‌కు అయ్యే వ్యయంపై అంచనాలు వేసి హెచ్‌ఎండీఏకు త్వరలో సమర్పించనున్నారు. అనంతరం కారిడార్ పనులు ప్రారంభం కానున్నాయి.






