మూడు ముక్కలుగా గ్రేటర్!
- జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు బ్రేక్
- విభజన దిశగా సర్కార్ వడివడి అడుగులు
- ఫిబ్రవరి 10తో ముగియనున్న పాలకమండలి గడువు
- ఎన్నికల ఊసే లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన ఖాయం
- ప్రజా పాలన స్థానంలో అధికారుల పాలన
- భవిష్యత్తుపై కార్పొరేటర్లలో అయోమయం.. ఆశావహుల్లో ఆందోళన
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కతృం కాబోతోంది. దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థల్లో ఒకటైన గ్రేటర్ హైదరాబాద్ భౌగోళిక, పరిపాలనా స్వరూపం పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మరింత మెరుగైన సేవల పేరుతో జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుండగా.. ఇప్పటి వరకు ఎన్నికల షెడ్యూల్ రాకపోవడం, కనీసం ఆ దిశగా కసరత్తు జరగకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరు స్తోంది. గ్రేటర్‌ను మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనను ప్రభు త్వం సీరియస్‌గా పరిశీలిస్తుండటంతో.. బల్దియా ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే... ప్రస్తుతం విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ జీహెచ్‌ఎంసీ పరిధి భారీగా విస్తరించింది.
దీంతో ఒకే మేయర్, ఒకే కమిషనర్ కింద ఇంత పెద్ద నగరాన్ని నిర్వహించడం, పారిశుద్ధ్యం, వరదలు, అభివృద్ధి పనులను పర్యవేక్షించడం కష్టంగా మారుతోందన్న భావన ప్రభుత్వంలో ఉంది. అందుకే గ్రేటర్‌ను మూడు ముక్కలుగా చేసి.. హైదరాబాద్ కార్పొరేషన్ పాతబస్తీ, కోర్ సిటీ, సికింద్రాబాద్ కార్పొరేషన్ కంటోన్మెంట్, ఉత్తర హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్ ఐటీ కారిడార్, పశ్చిమ హైదరాబాద్ పేరిట ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు మున్సిపల్ చట్టంలో మార్పులు చేసి, అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాతే ఎన్నిక లకు వెళ్లాలని ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. గతంలో బెంగళూరులో కూడా ఇలాంటి ప్రయోగమే జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లోనూ అదే ఫార్ములాను అమలు చేసి, రాజకీయంగానూ పట్టు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగుస్తుంది. నిబంధనల ప్రకారం గడువు ముగిసేలోపే ఎన్నికలు జరగాలి.
కానీ విభజన ప్రతిపాదన తెరపైకి రావడంతో ఎన్నికలు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో ఫిబ్రవరి 11 నుంచి జీహెచ్‌ఎంసీ పగ్గాలు ప్రజాప్రతినిధుల చేతుల నుంచి అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. పాలకమండలి స్థానంలో ప్రభుత్వాధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించి పాలన సాగించనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల పదవీకాలం ముగియనుండటంతో.. బల్దియాపై ఐఏఎస్ అధికారుల పెత్తనం మొదలుకానుంది.
రాజకీయ అనిశ్చితి.. ఆశావహుల ఆవేదన..
ప్రభుత్వ తాజా నిర్ణయాలతో గ్రేటర్ రాజకీయాల్లో స్తబ్దత నెలకొంది. తిరిగి టికెట్ ఆశిస్తున్న సిట్టింగ్ కార్పొరేటర్లు, కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఈ పరిణామంతో డీలా పడ్డారు. గ్రేటర్ మూడు ముక్కలైతే.. వార్డుల సరిహద్దులు మారుతాయా రిజర్వేషన్లు మారు తాయా అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
మూడు కార్పొరేషన్లు అయితే మూడు మేయర్ పదవులు వస్తాయని కొందరు సంబరపడుతుంటే.. పార్టీ టికెట్లు ఎవరికి దక్కుతాయోనని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనా, ఫిబ్రవరి 10 తర్వాత హైదరాబాద్ లో ప్రజా పాలన స్థానంలో అధికారుల పాలన రావడం ఖాయంగా కనిపిస్తోంది.




