కాలేశ్వరంతోనే పచ్చని పొలాలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్
నంగునూరు, ఫిబ్రవరి 27:కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్లతోనే నేడు కరువు ప్రాంతాలు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయని,దీనికి మైసంపల్లి గ్రామంలో పారుతున్న కాలువలే సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం నంగునూరు మండలంలోని మైసంపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మైసంపల్లిలో శ్రీ పెద్దమ్మ దేవాలయ ఉత్సవాలకు హాజరైన హరీష్ రావు, గతంలో తాను మంజూరు చేసిన నిధులతో ఆలయాలు అభివృద్ధి చెందడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడుతూ.. కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయో లేదో తెలుసుకోవాలంటే రేవంత్ రెడ్డి మైసంపల్లికి వచ్చి చూడాలి అని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు,యూరియా సరఫరా సజావుగా ఉండేవని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రైతుబంధు,కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి పథకాలన్నీ ఆగిపోయాయని విమర్శించారు.
అబద్ధాలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.అనంతరం వెంకటాపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న హరీష్ రావు,గ్రామంలోని మహిళా రైతులు పండిస్తున్న పంటలు జిల్లాకే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.గతంలో తాను చొరవ తీసుకుని 500 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించి రైతులకు రైతుబంధు అందేలా చేశానని గుర్తుచేశారు.
గ్రామస్తుల కోరిక మేరకు వచ్చే వార్షికోత్సవం నాటికి ఆంజనేయ స్వామికి కిరీటాన్ని చేయించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ జపా శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు లింగం గౌడ్,నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, కోల రమేష్ గౌడ్, ఎల్లంకి మహిపాల్ రెడ్డి ,వేముల వెంకట్రెడ్డి, కూతురు రాజిరెడ్డి, బద్దిపడగ కిష్టారెడ్డి,సర్పంచులు, సోమిరెడ్డి నరేష్ రెడ్డి ,రేకులపల్లి సంతోష్ రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




