30 August, 2026 | 5:20 AM

మద్దిమడుగు ఆలయం వద్ద హరిత హోటల్

29-08-2026 11:58 PM

- ఐదు మండలాలకు మినీ రాజీవ్ స్టేడియాలు మంజూరు

అచ్చంపేట: నల్లమల, అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం అచ్చంపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

మద్దిమడుగు ఆలయం వద్ద పర్యాటక అభివృద్ధిలో భాగంగా రూ.15 కోట్లతో హరిత హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. నల్లమల ప్రాంతంలోని క్రీడాకారులు, కళాకారులను ప్రోత్సహించేందుకు బల్మూరు, పదర, ఉప్పునుంతల, లింగాల, అమ్రాబాద్ మండలాలకు మినీ రాజీవ్ స్టేడియాలు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో స్టేడియానికి రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు.

ఉప్పునుంతల, అమ్రాబాద్ మండలాల్లో స్టేడియాల కోసం ఐదు ఎకరాల చొప్పున స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఉప్పు నుంతలలో తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకు ఏర్పాటుకు 726 గజాల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు సీఎం రూ.100 కోట్లు కేటాయించగా, తొలి దశలో రూ.24 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. అన్ని వర్గాల అభివృద్ధితో పాటు చారిత్రక, సాంస్కృతిక అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.