26 July, 2026 | 1:30 AM

లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్!

26-07-2026 12:00 AM

దక్షిణాది స్టార్ బ్యూటీ సాయిపల్లవి ఇటీవలే బాలీవుడ్‌లో ‘ఏక్ దిన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రొమాంటిక్ డ్రామాలో జునైద్ ఖాన్ సరసన కనిపించగా, ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలావుంటే, సాయిపల్లవి ప్రస్తుతం నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మైథాలాజికల్ ప్రాజెక్టు ‘రామాయణ’లో సీతాదేవి పాత్రలో నటిస్తోంది. ఇటీవలే ధనుష్ ‘ఓం’ చిత్రంలో ఓ హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇంకా సాయిపల్లవి  ఖాతాలో కొత్తగా మరో రెండు ప్రాజెక్టులు చేరినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి దిగ్గజ దర్శకుడు మణిరత్నం, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబో ప్రాజెక్ట్. ఈ రొమాంటిక్ డ్రామాలో విజయ్ సేతుపతి సరసన కనిపించనుంది సాయిపల్లవి. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది.

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారని, ఆ తర్వాత పుదుచ్చేరి వంటి పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారని సమాచారం. దీంతోపాటు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సాయిపల్లవి మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో అలరించనుంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఒక శక్తిమతమైన కథాంశంతో ఈ సినిమాను మహిళా ప్రాధాన్య చిత్రంగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్.

ఈ సినిమా కోసం సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నారని, ఇప్పటికే ఆమె కథ వినడం కూడా జరిగిందనేది ఫిలింనగర్ సర్కిళ్లలో వినవస్తున్న టాక్. ఫీల్ గుడ్ డ్రామాలు, భావోద్వేగాల మేళవింపుతో సినిమాలు తీసే దర్శకుడు కిషోర్ తిరుమల, ఈసారి తన మూస పద్ధతిని పక్కన పెట్టి ఇప్పుడు పూర్తిగా కథానాయిక చుట్టూ తిరిగే ఒక మంచి కథను రాసుకున్నారట. ఈ కథకు సాయిపల్లవి అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి ఆమెను కలిసినట్లు సమాచారం.