7 May, 2026 | 1:01 AM

ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి గ్రీన్ సిగ్నల్..

07-05-2026 12:08 AM
  1. ఫలించిన మంత్రి తుమ్మల కృషి
  2. నిర్మాణానికి టిటిడి బోర్డు ఆమోదం
  3. ఖమ్మం ఆధ్యాత్మిక కేంద్రం దిశగా అడుగు
  4. 20 ఎకరాల్లో తిరుమల తరహా నిర్మాణం ద్వంసలాపురంలో భూమి కేటాయింపు
  5. ‘చిన్న తిరుమల’గా అవతరించనున్న ఖమ్మం 
  6. సీఎం రేవంత్, క్యాబినెట్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి తుమ్మల 

ఖమ్మం, మే 6(విజయక్రాంతి): ఖమ్మం నగర ఆధ్యాత్మిక చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచే పరిణామం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహకారంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదురుచూస్తున్న కల సాకార దశలోకి అడుగుపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం ధ్వంసలాపురం రెవిన్యూ పరిధిలో కేటాయించిన 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రతిష్టాత్మక ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే భూమి కేటాయింపుకు ఆమోదం తెలపగా, తాజాగా టీటీడీ బోర్డు కూడా అనుమతి ఇవ్వడంతో నిర్మాణానికి అన్ని మార్గాలు సుగమమయ్యాయి.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయం ఈ ప్రతిష్టాత్మక యత్నానికి బలంగా నిలిచాయి. తిరుమల తరహా దర్శనం, సదుపాయాలు ఖమ్మంలోనే అందుబాటులోకి రానుండగా, జిల్లా ‘చిన్న తిరుమల’గా రూపుదిద్దుకునే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. దీంతో ఖమ్మం, పరిసర ప్రాంతాల భక్తులకు తిరుమల తరహా దర్శన సౌకర్యాలు, ఆధ్యాత్మిక అనుభూతి స్థానికంగానే అందుబాటులోకి రానుంది. 

ఫలించింన తుమ్మల కృషి....

ఈ మహత్తర ప్రాజెక్టు సాధనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, తిరుమల దర్శనానికి వెళ్లలేని వారికి స్థానికంగానే టీటీడీ తరహాలోనే టీటీడి వారి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం ఏర్పాటు చేయాలని ఆయన నిరంతరం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించడం ద్వారా ఈ ప్రక్రియ వేగం పుంజుకుంది.

20 ఎకరాల్లో తిరుమల వాతావరణం...

ఖమ్మం నగరంలోని ద్వంసలాపురం పరిధిలో కేటాయించిన 20 ఎకరాల భూమిలో ఆలయంతో పాటు యాత్రికుల కోసం వసతి గృహాలు, కళ్యాణ మండపం, పార్కింగ్ సౌకర్యాలు, ధార్మిక కార్యకలాపాల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.  టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుండగా, ఈ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా కీలకంగా మారనుంది.

తిరుమల శైలిలో నిర్మాణం.

టీటీడీ నిర్మించే ఆలయాలు సాధారణంగా తిరుమల శైలిని ప్రతిబింబిస్తాయి. ఖమ్మంలో కూడా అదే నమూనాలో ఆలయ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.  టీటీడీ ప్రణాళికల ప్రకారం ఆలయాన్ని సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. నిత్య కైంకర్యాలు, అర్చనలు  సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. భక్తులకు ఉచిత అన్నప్రసాదం, వసతి గృహాలు, విశాలమైన పార్కింగ్ స్థలాలు, ఆధునిక క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదం పంపిణీ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. శుచిత్వం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

ఖమ్మం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరింది...: మంత్రి తుమ్మల

త్వరలోనే టీటీడీ అధికారులతో సమావేశమై నిర్మాణ పనులను వేగవంతం చేస్తాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. టీటీడీ బోర్డు ఆమోదంతో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి మార్గం సుగమమవడంతో, ఖమ్మం నగరం త్వరలోనే ఆధ్యాత్మిక కేంద్రమైన చిన్న తిరుమలగా రూపుదిద్దుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలియజేశారు.