26 May, 2026 | 2:47 AM

మునుగోడులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

26-05-2026 01:50 AM

మునుగోడు, మే 25: మునుగోడు మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు చేశారు. దీనిలో భాగంగా మండల కేంద్రంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫుడ్ గ్రైన్ స్టోరేజ్ భవనాలకు, కస్తూర్బా బాలికల పాఠశాలలో రూ.62 లక్షల వ్యయంతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కస్తూర్బా కళాశాల భవనం, వంటగది, డైనింగ్ హాల్, తరగతి గదులు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు.

విద్యార్థినులు ఇబ్బందులు పడకుండా పాఠశాలలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న టాయిలెట్లు, స్నానపు గదులతో పాటు ప్రత్యేక డ్రెస్సింగ్ రూములు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. వంటగది పక్కనే వంట సామగ్రి నిల్వ చేసేందుకు ప్రత్యేక స్టోర్ రూమ్, దాని పక్కనే డైనింగ్ హాల్ ఉండేలా మార్పులు చేయాలన్నారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అందుకు చేపట్టాల్సిన పనులపై పూర్తి జాబితా సిద్ధం చేయాలని సిబ్బందికి ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా డీఈఓ బిక్షపతి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కస్తూర్బా పాఠశాల సిబ్బంది ఉన్నారు.