జీపీ, మహిళా సమైక్య భవనాలకు భూమిపూజ
గట్టు, జూలై 17: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి ఆర్‌అండ్‌ఆర్ సెంటర్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనాలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్, సర్పంచ్ ఉప్పరి దేవేందర్తో కలిసి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా జె. విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో గ్రామపంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనం కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. భవనాల నిర్మాణం పూర్తయితే ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుతాయని, మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






