18 July, 2026 | 1:49 AM

నేడు సరూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ భారీ సభ

18-07-2026 01:49 AM
  1. యువ సంగ్రామ సదస్సుకు రంగం సిద్ధం 
  2. హైకోర్టు ఆదేశాలతో సభ నిర్వహణకు లైన్‌క్లియర్ 
  3. ముందుగానే దరఖాస్తు చేసుకున్నా అనుమతికి జాప్యమెందుకని పోలీసులకు హైకోర్టు ప్రశ్న 
  4. సభకు హాజరుకానున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యువ సంగ్రామ సదస్సు’కు ఏర్పాటు పూర్తయ్యాయి. హైద రాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం ఈ సభ జరగనుంది. ఈ సభతో నిరుద్యోగులు, విద్యార్థులు, యువత సమస్యలను ప్రధాన అజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి శ్రీకారం చుట్టాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.

యువ సంగ్రామ సదస్సుకు తొలుత పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్‌ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. శాంతియుతంగా సభ నిర్వహించుకోవాలని, రహదారుల దిగ్బంధం చేయరాదని, రెచ్చగొట్టే ప్రసంగాలు ఉండకూడదనే షరతులతో అనుమతి మంజూరు చేసింది. 17 రోజుల క్రితమే దరఖాస్తు చేసినప్పటికీ ముందుగానే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించింది.

హైకోర్టు అనుమతితో సభకు ఉన్న అనిశ్చితి తొలగిపోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా పార్టీ ఏర్పాట్లు చేసింది. సభ విజయవంతం కోసం జిల్లా స్థాయిలో నాయకులు ఇప్పటికే విస్తృతంగా సమీకరణ చేపట్టారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇదే సరూర్‌నగర్ వేదికగా ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’లోని హామీలను అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, యువతకు ఇచ్చిన ఇతర హామీల అమలును డిమాండ్ చేస్తూ ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ పోరాటానికి ఈ సభను కీలక వేదికగా మలచాలని పార్టీ భావిస్తోంది. సభలో కేటీఆర్ యువతకు సంబంధించిన పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.