18 July, 2026 | 2:01 AM

పంటల సాగు సగం లోపే!

18-07-2026 02:01 AM
  1. అంచనా 132 లక్షల ఎకరాలు.. ఇప్పటివరకు 59.83 లక్షలే
  2. వర్షాభావంతో మారుతున్న సాగు ముఖచిత్రం
  3. వరి నాట్లకు జంకుతున్న అన్నదాతలు 
  4. సోయాబిన్, పత్తి పంటలు ఆశాజనకం

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి) : వానాకాలం ప్రారంభమై నెల న్నర గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో సాగు మందగించింది. ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడటం రాష్ట్ర వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభా వం చూపుతోంది. ఈ వానాకాలం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 1,32,38,446 ఎకరాల్లో సాగు అవుతుందని ప్రభుత్వం అంచనా వేయగా.. ఇప్పటివరకు 59,83,971 ఎకరాల్లో (45.20శాతం) మాత్రమే సాగు చేశారు.

అంటే లక్ష్యంలో 50 శాతం కూడా దాటలేదు. వరి సాధారణ సాగు లక్ష్యంగా 65.96 లక్షల ఎక రాలుగా నిర్దేశించగా 6.60 లక్షల ఎకరాలకు మించలేదు. కేవలం 9.70 శాతం మాత్రమే నాట్లు పడడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. జొన్న, సజ్జ, మక్కజొన్న, రాగి, ఇతర చిరుధాన్యాల సాగు లక్ష్యం 72.49 లక్షల ఎక రాలు కాగా, కేవలం 10.20 లక్షల ఎకరాల్లోనే (14.08 శాతం) సాగైంది.

పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 47.41 లక్షల ఎకరాలు ఉండగా 41.12 లక్షల ఎకరాల్లో అంటే 86.72 శాతం విత్తనాలు నాటారు. సోయాబిన్ 4.16 లక్షల ఎకరాలు అంచనా వేయగా, 3.35 లక్షల ఎకరాల్లో విత్తనాలు నాటారు. సోయాబిన్ కూడా 80.57 శాతం వరకు పంట నమోదైంది.  

వ్యవసాయమే జీవనాధారం

ఈ సమయానికి వ్యవసాయ పనులతో కళకళలాడాల్సిన పంట పొలాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు, కూలీలు ఉన్నారు. వీరంతా వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా బతుకుతున్నారు. రైతులు సాధార ణంగా జూన్, జులై మాసాల్లో విత్తనాలు విత్తుకోవడం, వరి నాట్లు వేసుకోవడంలో తీరిక లేకుండా ఉంటారు. కానీ, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి లేక రైతులు, వ్యవసాయ కూలీలు ఖాళీగా ఉంటున్నారు.

జూన్‌లో  2 శాతం, జూలైలో 16 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెలాఖరు వరకు పరిస్థితులుల ఎలా ఉంటాయోనని ఆయా వర్గాల్లో ఆందోళన నెలకొంది. జూన్ 10 లోపు పత్తి విత్తనాలను నాటుకోవాల్సి ఉంటుంది. ఈనెల రెండో వారంతో అదును దాటిపోయింది. వరి నాట్లు వేసే పరిస్థితి కూడా లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. భూగర్భ జలాలు అడుగుంటడంతో బోర్లు ఆగిపోస్తున్నాయి.

ఒక వేళ  చిన్న వర్షాలు పడినా నాటు వేయలేమని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ లాంటి  జిల్లాల్లో కొందరు రైతులు సాహసించి బోర్లు, బావుల కింద కొద్దిమేర వరి నాట్లు వేశారు. పత్తి, సోయాబిన్ మినహా మిగతా అరుతడి పంటల సాగు కూడా అంతంత మాత్రంగానే ఉంది. మొత్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల గ్రామాల్లో పశువులకు పచ్చిమేత దొరకని పరిస్థితి నెలకొంది. 

హైదరాబాద్‌లో అడుగంటుతున్న జల మట్టాలు

ఎల్ నినో హైదరాబాద్ ప్రజలను భయపెడుతోంది. ఇక్కడ అత్యంత వేగంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. జంటనగరాల్లో 2.47 మీటర్ల మేర పడిపోయి సగటున 12.43 మీటర్ల లోతుకు చేరాయి. పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో తాగు నీటికి తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.