విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవు
కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
కల్వకుర్తి జూలై 17: ప్రభుత్వ ఉద్యోగులు విధుల పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారి పట్ల చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హెచ్చరించారు. శుక్రవారం వెల్దండ మండలం, కల్వకుర్తి పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతి సౌకర్యాలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులను గుర్తించి, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి నీ ఆదేశించారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. వైద్య సిబ్బంది, రోగులతో మాట్లాడి సేవల నాణ్యతపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తుందని , ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. వారితో పాటు తాసిల్దార్ ఇబ్రహీం, మున్సిపల్ చైర్ పర్సన్ రత్నమాల, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ , వివిధ శాఖల అధికారులు ఉన్నారు.






