18 July, 2026 | 1:52 AM

ఎంపీలో ఇంజినీరింగ్ అద్భుతం

18-07-2026 01:52 AM

దేశంలోనే అతి పొడవైన స్లీమనాబాద్ వాటర్ టన్నెల్ పూర్తి 

అనేక సవాళ్లు ఎదుర్కొంటూ విజయవంతంగా పూర్తిచేసిన ఎస్‌ఈడబ్ల్యూ

హైదరాబాద్, జూలై 17(విజయక్రాంతి) : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలో నిర్మిస్తున్న స్లీమనాబాద్ వాటర్ టన్నెల్ తవ్వకం పూర్తికావడంతో దేశ నీటిపారుదల రంగంలో మరో కీలక మైలురాయిగా ఈ ప్రాజెక్టు నిలిచింది. దాదాపు 17 ఏళ్ల పాటు ఎన్నో సాంకేతిక, భౌగోళిక సవాళ్లను అధిగమిస్తూ నిర్మించిన ఈ టన్నెల్ దేశంలోనే అత్యంత పొడవైన వాటర్ టన్నెల్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ టన్నెల్ నర్మదా వ్యాలీ డెవలప్మెంట్ అథారిటీ(ఎన్‌వీడీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన బర్గీ డైవర్షన్ ప్రాజెక్ట్‌లో అత్యంత కీలక భాగం గా నిలిచింది. మొత్తం 11.952 కిలోమీటర్ల పొడవు, 10.14 మీటర్ల వ్యాసం కలిగిన ఈ టన్నెల్ ద్వారా నర్మదా నది నీటిని ఎలాం టి పంపులు, విద్యుత్ వినియోగం లేకుం డా సహజ గురుత్వాకర్షణ(గ్రావిటీ ఫ్లో) ద్వారా సోన్ నదీ పరివాహక ప్రాంతానికి తరలించనున్నారు.

నీటిని పూర్తిగా సహజ ప్రవాహంతో తరలించే విధంగా రూపకల్పన చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. దీని వల్ల విద్యుత్ వ్యయం తగ్గడమే కాకుండా, నిర్వహణ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. ఈ టన్నెల్ బర్గీ డైవర్షన్ ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువలో భాగంగా నిర్మితమైంది.

టన్నెల్ ముగిసిన తర్వాత కాలువ మరో 129 కిలోమీటర్ల వరకు  ఓపెన్ కెనాల్ రూపంలో కొనసాగుతుంది. మొత్తం కాలువ సామర్థ్యం 227 క్యూమెక్స్ కాగా, టన్నెల్ ద్వారా ఒక్కసారిగా 152 క్యూమెక్స్ నీరు ప్రవహించే సామర్థ్యం ఉంది. దీంతో మధ్యప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక నీటి సామర్థ్యం కలిగిన కాలువ వ్యవస్థగా ఈ ప్రాజెక్టు నిలవనుంది.

17 ఏళ్ల పోరాటం.. అనేక సవాళ్లు..

ఈ ప్రాజెక్టు నిర్మాణం 2008లో ప్రారంభమైంది. అయితే నిర్మాణ సమయంలో ఇంజినీర్లు  ఎన్నడూ ఎదురుకాని సవాళ్లను ఎదుర్కొన్నారు. భూమికి సుమారు 30 మీటర్ల లోతులో మార్బుల్, లైమ్‌స్టోన్, డోలోమైట్ వంటి అత్యంత గట్టి శిలల మధ్య టన్నెల్ తవ్వాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో భారీ భూగర్భ గుహలు ఎదురుకావడం, నిమిషానికి 25 వేల లీటర్ల వరకు భూగర్భ జలాలు లోనికి రావడం, తరచూ నేల కూలిపోవడం వంటి పరిస్థితులు ఎన్నోసార్లు పనుల నిలిపివేతకు కారణమయ్యాయి.

ప్రారంభంలో వినియోగించిన అమెరికాకు చెందిన టన్నెల్ బోరింగ్ మెషిన్ తీవ్ర భౌగోళిక పరిస్థితులను తట్టుకోలేక దెబ్బతింది. అనంతరం జర్మనీకి చెందిన హెర్రెన్ క్నెచ్ట్ సంస్థ తయారు చేసిన అత్యాధునిక టన్నెల్ బోరింగ్ మెషిన్ను ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు.

అలాగే టీఏఎం గ్రౌటింగ్ టెక్నాలజీని ఉపయోగించి బలహీనమైన రాతి పొరలను బలోపేతం చేస్తూ పనులు కొనసాగించారు. టన్నెల్ జాతీయ రహదారి, రైల్వే ట్రాక్‌లు, జనావాసాల కిందుగా వెళ్లినప్పటికీ ఎలాంటి నష్టం జరగకుండా నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేయడం ఇంజినీరింగ్ రంగంలో భారీ విజయంగా భావిస్తున్నారు.

2.45 లక్షల హెక్టార్లకు సాగునీరు.. 1,450 గ్రామాలకు లబ్ధి.. 

ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత జబల్‌పూర్, కట్నీ, మైహర్, సత్నా, రేవా, పన్నా జిల్లాల్లోని దాదాపు 2.45 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి శాశ్వత సాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. దాదాపు 1,450 గ్రామాలు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. జిల్లాల వారీగా చూస్తే సత్నా జిల్లాలో అత్యధికంగా 1,04,970 హెక్టార్లు, మైహర్‌లో 54,227 హెక్టార్లు, కట్నీలో 21,823 హెక్టార్లు, రేవా, పన్నా జిల్లాల్లో కూడా వేలాది హెక్టార్ల భూమికి సాగునీరు అందనుంది.

ఇప్పటికే ప్రాజెక్టు తొలి దశ ద్వారా 44,160 హెక్టార్లకు సాగునీటి సామర్థ్యం సృష్టించగా, 2026 డిసెంబర్ నాటికి 87,433 హెక్టార్లకు, 2027 డిసెంబర్ నాటికి 1,54,693 హెక్టార్లకు సాగునీటి సౌకర్యాన్ని విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టన్నెల్ ద్వారా కేవలం సాగునీరు మాత్రమే కాకుండా కట్నీ నగరంతో పాటు సమీప గ్రామాలకు నర్మదా నీటిని తాగునీటిగా కూడా సరఫరా చేయనున్నారు.

దీని వల్ల భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గి, తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. సాగునీరు పెరగడంతో పంటల ఉత్పత్తి, రైతుల ఆదాయం పెరగడమే కాకుండా వింధ్య, మహాకౌశల్ ప్రాంతాల్లో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ టన్నెల్ నిర్మాణం పూర్తికావడం భారత దేశంలో నీటిపారుదల రంగంలో అత్యంత క్లిష్టమైన ఇంజినీరింగ్ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ప్రకృతి విసిరిన ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ 17 ఏళ్ల పాటు సాగిన ఈ ప్రాజెక్టు, భవిష్యత్తులో భారీ గ్రావిటీ ఆధారిత నీటిపారుదల ప్రాజెక్టులకు ఆదర్శంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విజయవంతంగా పూర్తిచేసిన ఎస్‌ఈడబ్ల్యూ

దేశంలోనే అత్యంత పొడవైన స్లీమనాబాద్ వాటర్ టన్నెల్ నిర్మాణంలో హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఈడబ్ల్యూ సంస్థ కీలక పాత్ర పోషించింది. 2008లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును టర్న్ కీ పద్ధతిలో ఈ సంస్థకు అప్పగించింది. దాదాపు 17 ఏళ్లపాటు ఎన్నో సాంకేతిక, భౌగోళిక సవాళ్లను ఎదుర్కొంటూ సంస్థ టన్నెల్ తవ్వకాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

ప్రారంభంలో రూ. 799 కోట్లుగా అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయం, నిర్మాణ సమయంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులు, అత్యాధునిక అంతర్జాతీయ సాంకేతికత విని యోగం, అదనపు భద్రతా చర్యలు, పనుల కాల వ్యవధి పెరగడం కారణాలతో రూ. 1,610.47 కోట్లకు పెరిగింది. అయినప్పటికీ పనులను నిలిపివేయకుండా దశలవారీగా పూర్తి చేయడంలో పటేల్ జాయింట్ వెంచర్ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది.

మార్బుల్, లైమ్‌స్టోన్, డోలమైట్ వంటి గట్టి శిలలను ఛేదిస్తూ, భారీ భూగర్బ జలాల ప్రవాహాన్ని నియంత్రిస్తూ, జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, జనావాసాల కిందుగా సురక్షితంగా టన్నెల్ నిర్మించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా నిలిచింది. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 96.66 శాతం పూర్తయ్యాయి.

ప్రధాన టన్నెల్‌తోపాటు కాలువ నిర్మాణం కూడా పూర్తవగా, కొద్దిపాటి కట్-అండ్-కవర్ కాలువ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు విజయంతో హైదరాబాద్‌కు చెందిన పటేల్-ఎస్‌ఈడబ్ల్యూ జాయింట్ వెంచర్ దేశంలోని భారీ నీటి పారుదల, టన్నెలింగ్ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయగల సంస్థగా మరోసారి తన సత్తాను చాటుకుంది.