ఇబ్రహీంబాగ్ చెరువు పునరుజ్జీవనానికి అంకురార్పణ
భూమిపూజ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
మణికొండ, జూన్ 25 (విజయక్రాంతి): దశాబ్దాల కాలంగా స్థానిక ప్రజలు నిరంతరం చేస్తున్న పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఇబ్రహీంబాగ్ చెరువు పునరుజ్జీవన పనులకు గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు, స్థానికులతో కలిసి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనూ పునరుద్ధరణ పనులు ఆగవని, వచ్చే వర్షాకాలం లోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.గత పదేళ్లుగా ఇబ్రహీంబాగ్ లేక్ కమిటీ చేసిన కృషిని అభినందిస్తూ, స్థానికులను కలుపుకుని కమిటీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
మిగిలిన అభివృద్ధి పనుల వేగవంతానికి సీఎంసీ కమిషనర్తో చర్చిస్తామన్నారు. నెక్నాంపూర్ చెరువు డ్రైనేజ్ డైవర్షన్ పనులు కూడా పురోగతిలో ఉన్నట్లు ప్రతినిధులు అధికారులకు వివరించారు. ఈ విజయం స్థానిక నివాసితులదేనని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలానికి పునరుద్ధరించిన చెరువును ముఖ్యమంత్రి ప్రజలకు అంకితం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్, అధికారులు పాల్గొన్నారు.






