హస్తంలో గ్రూపు తగాదాలుl
కాంగ్రెస్‌లో చేరికలపై స్థానిక నాయకుల ఆగ్రహం
రెండుగా చీలిన క్యాడర్, వేర్వేరుగా ప్రచారం
వికారాబాద్, తాండూర్‌లో తోపులాటల వరకు వెళ్లిన విభేదాలు
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి తప్పని తిప్పలు
పార్టీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం
వికారాబాద్, మే 2( విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. జిల్లాలో ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాలని ఏకంగా సీఎం చెప్పినా స్థానిక నాయకులు పెడచెవిన పెడుతున్నారు. కొందరు నాయకులు బీఆర్‌ఎస్ వలసలను ప్రోత్సహిస్తుండగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఈ ఘర్షణలు సమావేశాల్లో తోపులాటల వరకు వెళ్లింది. సీఎం సొంత జిల్లాలో ఈ స్థాయిలో తగాదాలు ఉండటం పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందని తెలిసినా నేతలు, కార్యకర్తలు ఎక్కడా తగ్గడం లేదు. ఎన్నికలు మరో పది రోజులుండగా ఈ పరిణామాలు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి ఇబ్బందిగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సొంతపార్టీ నాయకులకే సవాల్ విసురుతుండటం గమనార్హం. ప్రధానంగా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకుల్లోనే ఈ విబేధాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
వికారాబాద్‌లో రెండు గ్రూపులుగా..
ఎంపీ రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వచ్చినప్పటి నుంచి వికారాబాద్ మున్సిపల్, నియోజకవర్గ నాయకుల్లో విభేదాలు మొదలయ్యాయి. వికారాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ఒకవైపు, మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల, ఆమె భర్త రమేశ్ కుమార్ మరోవైపు గ్రూపులుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, మున్సిపల్‌లోని సీనియర్ నాయకులు సైతం రెండుగా చీలిపోయారు. ఈ పరిణామాలన్నీ స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ ప్రసాద్‌కుమార్ దృష్టిలో ఉన్నా ఏమీ చేయలేకపోతున్నట్లు సమాచారం. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నా నమ్మి నడిచినవారు ఒక గ్రూపుగా, ఆయన విజయం కోసం కృషి చేసినవారు మరో గ్రూపుగా విడిపోవటంతో ఎవరినీ కాదనలేకపోతున్నట్లు తెలుస్తోంది. చేరికలను ప్రోత్సహించాలని అధిష్ఠానం ఆదేశాల నేపథ్యంలో అటు పార్టీ నుంచి ఇటు స్థానికుల నుంచి ఇబ్బందులు తప్పేలా లేవు. మంగళవారం కొంతమంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, నేతలను కాంగ్రెస్‌లో చేర్పించేందుకు స్పీకర్‌తో పాటు రంజిత్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లారు. ఈ విషయం తెలిసి స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో చేరికను వాయిదా వేసినట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చేరికలు లాభమా నష్టమా అనే విషయాన్ని రంజిత్‌రెడ్డి తేల్చుకోలేక పోతున్నట్లు వినికిడి. ఈ గ్రూపు తగాదాలు రంజిత్‌రెడ్డి కొంప ముంచేలా ఉన్నాయని సొంత పార్టీ నాయకులే అభిప్రాయపడుతుండటం గమనర్హం.
తాండూరులోనూ అదే పరిస్థితి..
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమక్షంలోనే స్థానిక నాయకులు రెండు వర్గాలుగా చీలి దాడులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ కూడా కొత్త, పాత నాయకుల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఇతర పార్టీల నుంచి చేరికలను పాత నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై మనోహర్‌రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ససేమీరా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ, ప్రస్తుత పట్టణ అధ్యక్షుల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు ఉన్నాయి. కొత్త వారిని పార్టీలో చేర్చుకోవడంతోనే తగాదాలు వస్తున్నాయని నాయకులు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారు. రంజిత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా వర్గపోరు తప్పడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు బీఆర్‌ఎస్‌లో ఉండి ఆ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ ఇన్‌చార్జిగా ఉన్న ఆయన ఇక్కడ నెలకొన్న కుమ్ములాటలను తట్టుకోలేక రెండు మూడు రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉండిపోయారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో చేరినా అదే పరిస్థితి నెలకొంది. ఐదు ఏళ్లపాటు తనవెంట నడిచిన బలమైన బీఆర్‌ఎస్ క్యాడర్‌ను తెచ్చుకుందామంటే కాంగ్రెస్ నేతలు ఒప్పుకోక పోవడం తలనొప్పిగా మారింది.




