గ్రూప్-1 పకడ్బందీగా నిర్వహించాలి
కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎస్
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈనెల 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా, సజావుగా నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు ఉన్నతాధికారులతో వీడియో కన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగేలా జిల్లావ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్‌కు టీజీపీఎస్‌సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి వివరించారు. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. బయోమెట్రిక్‌పై ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఏదైనా సమస్య తలెత్తితే తగిన సంఖ్యలో బయోమెట్రిక్ పరికరాలను కూడా అందుబాటులో ఉంచామన్నారు.
బ్లాక్ మార్కెటింగ్‌పై మరింత నిఘా
బ్లాక్ మార్కెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో సమర్థ చర్యలు తీసుకున్నందుకు కలెక్టర్లను సీఎస్ అభినందించారు. ౩ వారాలపాటు ఇదే నిఘా కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్యాక్ చేసిన విత్తనాలను కొనుగోలు చేసేలా చూడాలన్నారు.






