కాంగ్రెస్‌కు పెరుగుతున్న వలసలు
వివిధ పార్టీల నుంచి హస్తం గూటికి నాయకులు
ఏఐసీసీ అదేశాలతో పార్టీలోకి చేర్చుకుంటున్న పీసీసీ
కండువాలు కప్పడంలో బిజీగా జగ్గారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలసల జోరు కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావడం కోసం ఇతర పార్టీల్లోని అసంతృప్తులను కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ కారణాలతో కాంగ్రెస్‌కు దూరమైన నాయకులు ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది నేతలు కూడా హస్తం తీర్థం పుచ్చుకుంటున్నారు.
అయితే కాంగ్రెస్‌లోకి వచ్చే వారిని అడ్డుకుంటే.. బీజేపీలోకి వెళ్లే ప్రమాదం ఉందని, తద్వారా ఆ పార్టీ బలపడే అవకాశం ఉందని అధిష్ఠానం పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సూచించారు. దానికి అనుగుణంగా వెంటనే చేరికల కమిటీని నియమించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డికి చేరికల బాధ్యతలను అప్పగించారు. ఈ కమిటీ నిత్యం గాంధీభవన్‌లోనే అందుబాటులో ఉంటూ బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి వచ్చే వారికి కండువాలు కప్పుతోంది. వివిధ కుల సంఘాలు, సామాజిక సంస్థలతో కాంగ్రెస్‌కు మద్దతిచ్చే విధంగా చర్చలు జరుపుతున్నారు.
ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల నేతలు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ టికెట్ ఆశించి భంగపడిన నాయకులు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో డీసీసీ అధ్యక్షులు సాజిత్ ఖాన్, పార్టీ సీనియర్ నాయకురాలు గండ్ర సుజాత, సంజీవరెడ్డి మంగళవారం తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. వీరికి జగ్గారెడ్డి, కోదండరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వీరితో పాటు వనపర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శాంతయ్యతో పాటు 150 మంది కార్యకర్తలు మాజీ మంత్రి చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
10 ఎంపీ సెగ్మెంట్లకు పరిశీలకులు..
రాష్ట్రంలోని పది పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులకు పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవాం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ పరిశీలకులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారంలో ఇబ్బందులు, నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేయనున్నారు.
ఏఐసీసీ నియమించిన
పరిశీలకులు..
మెదక్: కొడికున్నిల్ సురేశ్
జహీరాబాద్: రాజ్‌మోహన్‌ఉన్నితాన్
మహబూబ్‌నగర్: జీసీ చంద్రశేఖర్
మల్కాజిగిరి: ఎస్ జ్యోతిమణి
చేవెళ్ల: హైబీ ఈడెన్
ఆదిలాబాద్: షపీ పరంబిల్
నిజామాబాద్: ఎన్‌ఎస్ బోసురాజు,
మంతర్‌గౌడ
నాగర్‌కర్నూల్: పీవీ మోహన్
సికింద్రాబాద్: రిజ్వాన్ అర్షద్
వరంగల్: రవీంద్ర దాల్వీ
సికింద్రాబాద్
కంటోన్మెంట్: పీ విశ్వనాథన్




