జీఎస్టీ విజయగాథ
దేశంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు సృష్టించాయి. ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.2.10 లక్షల కోట్లను దాటి పోయాయి. సాధారణంగా ఏప్రిల్ నెలలో మిగతా నెలలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడం, వ్యాపారులు లెక్కలు సరి చూసుకోవడం లాంటి కారణంగా పన్ను బకాయిలన్నీ చెల్లించడానికి ప్రయత్నిస్తుండడం దీనికి ప్రధాన కారణం. అయితే, 2007 జూలై లో జీఎస్టీని మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు ఈ పరోక్ష పన్ను వసూళ్లు నెలకు సగటున 90 వేలుగా ఉండగా, ఇప్పుడది రూ.2.10 లక్షలు దాట డం విశేషం. కరోనా ఉధృతంగా ఉన్న రెండేళ్లు మినహా ప్రతీ నెలా ఈ వసూళ్లు పెరుగుతూనే వస్తున్నాయి. ఏటా సగటున 13 శాతం చొప్పున పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. జీఎస్టీ వసూళ్లు ఇంతగా పెరగడం మన ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందనడానికి ఓ నిదర్శనమని ఆర్థికశాఖ వర్గాలు అంటున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ వస్తుసేవల పన్నును తీసుకు రావాలనే ఆలోచన మొదలైంది. 2000 సంవత్సరంలో పరోక్ష పన్నులపై ఏర్పాటు చేసిన కేల్కర్ టాస్క్‌ఫోర్స్ ఈ ప్రతిపాదన తెచ్చింది. పన్నుల విధానాన్ని సులభతరం చేయడంతోపాటు దేశమంతా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేశారు. 2009లో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ దీనికి సంబంధించి ఒక రోడ్‌మ్యాప్‌ను, తొలి చర్చాపత్రాన్ని రూపొందించింది.
2011లో దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్ల మెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే, అప్పుడు రాష్ట్రాలకు చెల్లించాల్సిన నష్టపరిహారం లాంటి పలు అంశాలకు సంబంధించిన సవాళ్లు ఎదురయ్యాయి. అంతేకాకుండా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సైతం జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక దఫాలు, చర్చలు, సమాలోచనలు జరిగిన తర్వాత 2014లో అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీ వస్తుసేవల పన్ను అమలుకు వీలు కల్పించే రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. లోక్‌సభ బిల్లును ఆమోదించగా, రాజ్యసభలో బిల్లుపై కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించాయి. వీటిలో కొన్నింటిని ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఆమోదించి తిరిగి లోక్‌సభకు పంపించింది. 2016 ఆగస్టులో లోక్‌సభ బిల్లును ఆమోదించడం, రాష్ట్రాలు దానికి ఆమోదం తెలియజేయడం, చివరగా 2016 సెప్టెంబర్ 8న రాష్ట్రపతి తుది ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఆ తర్వాత జీఎస్టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడమూ వేగంగా పూర్తయింది. కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ విధి విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. చివరికి కొత్త పన్ను విధానం 2017 జులై 1న అమలులోకి వచ్చింది.
జీఎస్టీ అమలు వెనుక ఇంత కథ నడిచింది. ఈ పన్నును ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిసారీ మార్పులు, చేర్పులూ చేసుకుంటూ రావడంతో ఇప్పుడు ఇది పూర్తిగా గాడిలో పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఆదాయం బాగానే పెరిగింది. ఇ‘ంతింతై వటుడింతై..’ అన్నట్లు పన్ను వసూళ్లు నెలకు రూ.2 లక్షల కోట్లు దాటి పోయాయి. ఈ జోష్ భవిష్యతులో కూడా కొనసాగనుంది. దీంతో ఇప్పుడు జీఎస్టీ పన్ను విధానాల్లో సంస్కరణలు తీసుకు రావడానికి మార్గం సుగమం అయిందనే చెప్పవచ్చు. ఎప్పటి నుంచో కోరుతున్న మద్యం, పెట్రోలు, డీజిల్, రియల్ ఎస్టేట్ రంగాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవడం, సామాన్యులు నిత్యం ఉపయోగించే వస్తువులను ఈ పన్ను పరిధినుంచి తప్పించడం లాంటి సంస్కరణల గురించి కౌన్సిల్ ఆలోచించవచ్చు. దీనివల్ల సామాన్యుడిపై భారం తగ్గడం సహా ప్రభుత్వానికి సైతం మరింతగా ఆదాయం సమకూరుతుంది. పాతకాలం నాటి ఆదాయం పన్ను చట్టం స్థానంలో ప్రత్యక్ష పన్ను కోడ్‌ను ప్రవేశపెట్టడం గురించి కూడా కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఆలోచించా లని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.






