12 May, 2026 | 10:56 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

నీ తల పగిలితే నా తల ఇస్తాను!

04-05-2024 12:05 AM

మా వూరినుంచి ఎప్పుడు హైదరాబాదుకు బయల్దేరినా కష్టాలు తప్పవు. మా వూరు బస్టాండుకు రెండు మైళ్ల దూరంలో వుంటుంది. నేను హైదరాబాదు వచ్చినప్పుడు ఏదో కొంత లగేజీ నా చేతిలో వుంటుంది. ఒక్కోసారి మూటగాని, సంచిగాని, చిన్న పెట్టెగాని తీసుకొని పట్నం రావడం కద్దు. నేను చిన్న పిల్లవాడిని కనుక మా అమ్మే నా లగేజీని బస్టాండు దాకా మోసుకు వచ్చేది. భవిష్యత్తులో ‘ఈ చిన్న కుమారుడు తన ఆలనాపాలనా చూసుకుంటాడ’ని ఆ తల్లి భరోసా. నిజం గా మా అమ్మ ఎంత దయామయో మాటలతో చెప్పలేను. ఆ తల్లి మా ఇంటిల్లి పాది కీ కల్పవల్లి. అందరి క్షేమమే ఆమె ధ్యేయం. నేను ఎప్పుడు హైదరాబాదుకు బయల్దేరినా ఆమె బస్టాండు దాకా వచ్చి సాగదో లేది. అట్లా చేస్తేగాని ఆమెకు కొండంత తృప్తి. ఆ రోజు ఆమె నా చిన్న సందుకను మోసుకొని బస్టాండు దాకా తెచ్చింది. బస్సు రాగానే అమ్మకు ‘బై’ చెప్పి ఆ చిన్న సందుకతో బస్సెక్కాను. నయం! ఆ రోజు కండక్టరు సందుక ఉంది కనుక బస్సులో చోటు లేదనలేదు. నేను సులభంగానే లోపల ప్రవేశించి వెనక్కి వెళ్లి ఖాళీగా వున్న సీట్లో కూర్చన్నాను. విండో సైడ్ ఒక భారీ కాయం ఉన్న వ్యక్తి కూర్చున్నాడు. ఆ సందుక (చిన్నపెట్టె)ను మా సీట్లకు పైన అవకాశం ఉంది కనుక అక్కడ పెట్టేశాను. మూడు గంటలు ప్రయాణిస్తే హైదరాబాదు వస్తుంది కనుక నిశ్చింతగా కూర్చు న్నాను. కండక్టర్ టికెట్ ఇచ్చాడుగాని, చిల్లర ఇవ్వలేదు. ఆ చిల్లరెంతో టికెట్ వెను క రాశాడు. ‘బస్సు దిగేటప్పుడు జ్ఞాపకం చేసి మరీ తీసుకో’ అని హెచ్చరించాడు. సరే, ‘చిల్లరే కదా’ అని ఊరుకుందామా అంటే, మనస్సు అంగీకరించలేదు. ప్రతి పైసకు ఆ కాలంలో ఎంతో విలువ. కనుక, శ్రీరామజపం లాగా మనస్సులో చిల్లరను జ్ఞాపకం చేసుకుంటూ కూర్చున్నాను.

నా మనస్సు చిల్లర మీద ఉంది. ‘బస్సు దిగేటప్పుడు నాకు జ్ఞాపకం ఉంటుందో, ఉండదో, కండక్టర్ ఇస్తాడో లేదో? చిల్లర లేదంటే ఏం చేయాలి?’ కొందరు కండక్టర్లు చిల్లర డబ్బు ప్రయాణికులకు ఇవ్వ కుండా ఉండటానికే టిక్కెట్టు వెనుక  రాస్తారనే అభిప్రాయం ఉంది. నా మనస్సు చిల్లర మీద లగ్నమైంది.  కానీ, నా పక్కన కూర్చున్న వ్యక్తి పదేపదే తల పైకెత్తి చూస్తున్నాడు. ‘ఎందుకా’ అని ఆలోచిస్తే, ‘ఆ సందుక తన తలమీద పడుతుందేమో’ అన్న భయం అతనిది. అరగంట దాకా అతడు తల పైకెత్తి చూడడం నేను గమనించాను. ఆ తర్వాత నాతో ఇట్లా అన్నాడు. “బాబూ! ఆ సందుకను నా తలమీద పెట్టా వు. అది నా తలమీద పడితే నేనుంటానా? దాన్ని తీసి నీ కాళ్ల దగ్గర పెట్టుకోరాదూ!” అని బ్రతిమిలాడిన విధంగా మాట్లాడాడు. నేను అప్పటికే ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాలలో చదువుతున్న వాణ్ణి. దేవులపల్లి రామానుజారావు సిఫారసుతో మునిమాణిక్యం నరసింహారావు దగ్గర లేఖకోద్యోగం చేస్తున్నవాణ్ణి.

సాయం కళాశాల కనుక పగలు ఏదైనా పని చేయడానికి అవకాశం ఉండేది. ఒకరోజు తప్పించి, మరొక రోజు గన్‌ఫౌండ్రీలో వున్న మునిమాణిక్యం వారి ఇంటికి వెళ్లి, వారు చెప్పిన కథగాని, వ్యాసం గాని, నవల గాని కాగితం మీద పెట్టేవాణ్ణి. టఈ లేఖకోద్యోగం తాత్కాలికమైనా,  నాకు భాషపట్ల శాశ్వతమైన అభిరుచిని కలిగించింది. నా ప్రక్కన ఉన్న పెద్ద మనిషిలో రానురాను ఆందోళన ఎక్కువైంది. ఆయన ఇక ఉండలేక “పెట్టెను తీస్తావా? లేదా?” అని గద్దించినంత పని చేశాడు. నాకప్పుడు హాస్య రచయిత మునిమాణిక్యం గారే కళ్లముందు కనిపించారు. ‘ఎవరైనా విసిగిస్తే విసుగు పడరాదు. ఎవరైనా బాధ పడితే బాధ పడరాదు. ఎవరైనా పరుష వాక్కులాడితే తిరిగి పరుష వాక్కులాడరాదు. ఎవరైనా ద్వేషిస్తే తిరిగి ద్వేషించరాదు’ అని వారు ప్రబోధించే వారు. ఎదుటివారి మనస్సును నొప్పించకుండా, మాటలతో ఒప్పించాలని, అందుకు ‘హాస్యం’ అనే బాణాన్ని వదలాలని వారు చెప్పేవారు.

ఆ పెద్ద మనిషి ఇక తాళలేక, “నా తల పగులతదయ్యా బాబు” అని అరిచినంత పని చేశాడు. నేను ఆ మాటలకు విసుక్కోలేదు. అతణ్ణి అసహ్యించుకోలేదు. అరవ లేదు కూడా. నెమ్మదిగా వారితో “అయ్యా! ఆ పెట్టె పడడం వల్ల మీ తల పగిలితే నా తల ఇస్తాను” అన్నాను. ఈ మాటలతడే కాదు, ప్రక్కనున్న ప్రయాణికులు కూడా విన్నారు. నేను ఆ మాటల్ని నిజంగా అన్నానో, హాస్యానికి అన్నానో నాకే తెలియదు. గురువుల ప్రభావం అలా ఉంటుంది అని మాత్రం నాకు అర్థమైంది. నా మాటలు విన్న ప్రక్క సీటులోని ప్రయాణికుడు నా ప్రక్కనున్న పెద్ద మనిషితో “ఇంకేం బాబు, మీ తలకేమైనా అయితే తన తలను ఇస్తానంటున్నాడు. నిశ్చింతగా ఉండొచ్చు కదా!” అన్నాడు. మాటలే  కాదు, ప్రక్కనున్న వారి మాటలకు పెద్ద మనిషి గప్‌చుప్‌గా ఉండిపోయాడు. బహుశా తన తలకు బదులుగా మరొక తల వస్తుందని భావించాడేమో. బస్సు హైదరాబాదుకు చేరింది. నేను నా సందుకను తీసుకొని బస్సు దిగి నా అద్దె గదికి బయల్దేరాను నిమ్మలంగా. మనిషి మనిషికి నమ్మకం కలిగిస్తే దానివల్ల కలిగే ప్రయోజనం ఎలా వుంటుందో ఈ సంఘటన నాకీనాటికీ గుర్తు చేస్తుంది.

రచయిత సెల్: 9885654381

నాకప్పుడు హాస్య రచయిత మునిమాణిక్యం గారే కళ్లముందు కనిపించారు. ‘ఎవరైనా విసిగిస్తే విసుగు పడరాదు. ఎవరైనా బాధ పడితే బాధ పడరాదు. ఎవరైనా పరుష వాక్కులాడితే తిరిగి పరుష వాక్కులాడరాదు.         ఎవరైనా ద్వేషిస్తే తిరిగి  ద్వేషించరాదు’ అని వారు ప్రబోధించే వారు. ఎదుటివారి మనస్సును నొప్పించకుండా, మాటలతో ఒప్పించాలని, అందుకు ‘హాస్యం’ అనే బాణాన్ని వదలాలని వారు చెప్పేవారు.