జీఎస్టీ వసూళ్ల జోరు
న్యూఢిల్లీ, జూలై 1: భారతదేశ జూన్ నెల జీఎస్టీ 13.9 శాతం పెరిగి, రూ. 1,94,812కోట్లకు చేరుకుంది. జూన్ 2025లో జీఎస్టీ వసూళ్లు రూ. 1,71,105గా నమోదైంది. బుధవారం ఆర్థికమంత్రిత్వ శాఖ జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన తాత్కాలిక డేటాను విడుదల చేసింది. దేశీయ లావాదేవీలతో జీఎస్టీ రూ. 1.35 లక్షల కోట్లుగా ఉండగా, దిగుమతుల పన్ను 34.6 శాతం పెరిగి, రూ. 60వేల కోట్లకు చేరుకుంది.
జూన్ నెల రీఫండ్ల విలువ రూ. 32,436 కోట్లు కాగా, సర్దుబాటు చేసిన తరువాత నికర జీఎస్టీ వసూళ్లు రూ. 1.62 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో జూన్ నెలలో తెలంగాణకు రూ. 5,050 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,548 కోట్లు వసూళ్లయ్యాయి. తెలంగాణ గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదు చేయగా, సర్దుబాటు అనంతరం నికరన జీఎస్టీ ఆదాయం రూ. 3,994 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నికర ఆదాయం రూ. 3,144 కోట్లుగా నమోదైంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వసూళ్లు 8.4 శాతం పెరిగాయి. రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర అత్యధికంగా రూ. 30,714 కోట్ల వసూళ్లు సాధించింది. అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం, త్రిపుర, ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్కండ్, మధ్యప్రదేశ్, లడఖ్‌లు గతేడాది కంటే తక్కువ జీఎస్టీ వసూళ్లను సాధించాయి.






