2 July, 2026 | 2:45 AM

సీఎంకు అభద్రతా భావం

02-07-2026 01:30 AM
  1. నితిన్ నబిన్ పర్యటనతో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు
  2. కాంగ్రెస్ అవినీతి, ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై ప్రశ్నించడంతోనే భయం 
  3. రాబోయే రోజుల్లో మోదీ సభలను చూస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటో! 
  4. మోదీ అభివృద్ధిపై, కాంగ్రెస్ వైఫల్యాలపై సెక్రటేరియట్ వద్ద చర్చకు సిద్ధమే 
  5. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది 
  6. మీడియాతో చిట్‌చాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజుల రాష్ట్ర పర్యటన విజయవంతం కావడం చూసి అధికార కాంగ్రె స్ పార్టీలో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో అభద్రతాభావం మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు తెలంగాణ ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి లభించిన అపూర్వ స్వాగ తం, ఆశీర్వాదాలు చూసి సీఎం ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయని ఆయన ఎద్దేవా చేశా రు.

గతంలో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం ఎన్నికల వ్యూహంతో ఓడించిన ఘనత కలిగిన నితిన్ నబిన్‌పై.. రేవంత్ రెడ్డి అహంకారంతో, రాజకీయ దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మమ తా బెనర్జీ బలహీనమైన ముఖ్యమంత్రి కాబట్టే ఓడిపోయిందని, తాను మమతా బెనర్జీ కాదని, తనను ఓడించడం ఎవరిత రం కాదంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య లు ఆయనలోని అభద్రతాభావాన్ని, భయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు.

‘నితిన్ నబిన్ నన్ను తీసేయలేడని రేవంత్ మాట్లాడాడు.. వాస్తవానికి ఆయన వచ్చిం దే ప్రజల సపోర్ట్‌తో రేవంత్‌ను తీసేయడానికే’ అని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్ బఘేల్ సర్కార్ పడిపోయినట్టే.. రేవంత్ సర్కార్ కూడా పడిపోతుందన్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై చర్చకు తాను సిద్ధమేనని పీసీసీ మహేశ్ కుమార్‌గౌడ్‌కు సవాల్ విసిరారు.

నితిన్ నబిన్ పిలుపునిచ్చిన ‘కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ’ నినాదానికి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని, ‘ఆర్‌ఆర్ ట్యాక్స్’ వసూళ్లను బీజేపీ ఎండగట్టడంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏం మాట్లాడాలో పాలుపోవడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో, యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. డూప్లికేట్, చనిపోయిన వారి ఓట్లను తొలగించడమే సర్ లక్ష్యమన్నారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది నాయకులు, ఎమ్మెల్యేలు సైతం క్యూలో ఉన్నారని పేర్కొన్నారు.

నితిన్ నబిన్ పర్యటన, రాంచందర్‌రావు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవడంపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన స్పందించారు. గడిచిన కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏం చేసింది, అలాగే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఎంత మోసం చేసింది అనే అంశాలపై సెక్రటరేరియట్ వద్ద బహిరంగ చర్చకు తాను సిద్ధమని రాంచందర్‌రావు స్పష్టం చేశారు.

దమ్ముంటే సచివాలయం (సెక్రటేరియట్) గేటు ముందు రెండు కుర్చీలు వేసుకుని డెవలప్‌మెంట్‌పై చర్చిద్దామని, వాన పడితే గొడుగులు కూడా తామే తెస్తామని సవాల్ విసిరారు. బీజేపీ నిర్వహించిన సంస్థాగత సమావేశాలకు వచ్చిన అపూర్వ స్పందనను చూసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్‌లో నిర్వహించిన సమావేశానికి 12 వేలకుగాను 11 వేలమందికిపైగా బూత్ అధ్యక్షులు, ఏజెంట్లు, వరంగల్లో 5 వేల మంది, పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి 3 వేల మంది జిల్లా కార్యకర్తలు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌కు ఆశించిన దానికంటే ఎక్కువగా 450 మంది ప్రతినిధులు హాజరయ్యారని వివరించారు.

ఇవి కేవలం పార్టీ అంతర్గత సంస్థాగత సమావేశాలేనని, వీటికే రేవంత్‌రెడ్డి ఫ్యూజులు ఎగిరిపోతే.. ఇక రేపు రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలు చూస్తే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి పోతారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కళ్లుండి కూడా బీజేపీ సభల సక్సెస్‌ను చూడలేకపోతున్నారని, కావాలంటే ఆయా మీటింగ్‌ల యూట్యూబ్ లింకులు రేవంత్‌రెడ్డికి పంపుతామని, ప్రశాంతంగా పడుకుని చూసి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆధారాలు లేని అపోహాలు పక్కనపెట్టి, చేతనైతే అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే..

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని, రాబోయే రోజుల్లో అధికారమే లక్ష్యంగా తాము పనిచేస్తామన్నారు. తాను బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిందని, తనకు సెలవుల్లేవు.. పార్టీకి సంబంధించి ప్రతీ రోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించామన్నారు. తాను చాలా సమస్యలపై పోరాడానని, ఎన్నో కార్యక్రమాలు చేశానని, ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వెళ్లాను.. ఒక్కో జిల్లాలో 2 లేదా 3 సార్లు పర్యటించానన్నారు.

ఆయా ప్రాంతాల్లో రాత్రి నిద్ర కూడా చేశానని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి యాక్సెప్టెన్సీ పెరిగిందని పేర్కొన్నారు. తొలిసారిగా ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ జెన్‌జీలతో కాంక్లేవ్ నిర్వహించారని తెలిపారు. బూత్ అధ్యక్షులతో నితిన్ నబీన్ సమావేశానికి 12 వేలమంది రావాలని భావిస్తే దాదాపు 11 వేలకు పైగా వచ్చారని, వరంగల్‌లో కూడా చాలా మంది వచ్చారన్నారు.

ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై మాట్లాడినందుకే..

కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ, ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై నితిన్ నబిన్ మాట్లాడినందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఫ్రస్టేషన్‌కులోనై...నితిన్ నబిన్ ఎవరు...తాను మమతా బెనర్జీ కాదని లాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. నితిన్ నబీన్ ఒక సామాన్య కార్యకర్త.. పార్టీ కోసం పనిచేసే వ్యక్తి అని, అలాంటిది ఆయన్ను పట్టుకుని ఆయనెవరో.. ఎందుకు వచ్చారో అని మాట్లాడుతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రేవంత్, కాంగ్రెస్ పరిస్థితి కూడా బీఆర్‌ఎస్, కేసీఆర్ గతేనని  హెచ్చరించారు.

నితిన్ నబీన్ తెలంగాణాకు వస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ యూరియా వ్యవస్థను మేనేజ్ చేయలేకపోతోందని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ స్థానిక లీడర్లు ఎరువుల డీలర్లతో కుమ్మక్కై బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. టీమ్ బీజేపీ సపోర్ట్‌తో తెలంగాణలో మరింత ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు.

నరేగాలో (మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం) ఎంతో అవినీతి జరిగిందని, జవాబు దారీతనం కోసమే వీబీ జీ రామ్ జీని తీసుకొచ్చామన్నారు. రేవంత్‌రెడ్డి.. నటుడు బాబు మోహన్‌లా యాక్ట్ చేయడం మానుకోవాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సర్ చేపట్టేది మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే.. వారిని కూడా కాంగ్రెస్ నమ్మడం లేదన్నారు. 

మహేశ్ కుమార్‌గౌడ్‌కే అవగాహన లేదు..

 తెలంగాణపై నితిన్ నబిన్‌కు అవగాహన లేదని మహేష్ కుమార్‌గౌడ్ అంటున్నారు.. వాస్తవానికి మహేష్‌కే నితిన్ గురించి అవగాహన లేదని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్ బఘేల్ సర్కార్ పడిపోయినట్టే.. రేవంత్ సర్కార్ కూడా పడిపోతుందన్నారు. ‘అయోధ్యలో స్కామ్.. మనీ స్కామ్ అంటున్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పునకు అందరినీ అనడం సరైనది కాదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తాను ఏడాదిలో చేసింది తక్కువే.. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. కేంద్ర క్యాబినెట్ విస్తరణపై నితిన్ నబిన్‌తో ఎలాంటి చర్చ జరగలేదని, దానిపై మోదీ మాత్రమే చెప్పగలరన్నారు. ఎవరు ఉంటారో..ఎవరు ఉండరో తనకు తెలీయదన్నారు. 

రేవంత్‌తో రాహుల్ జాగ్రత్తగా ఉండాలి..

ఒక్క వార్డు మెంబర్ కూడా లేని త్రిపురలో మూడుసార్లు గెలిచామని, హర్యానాలో 2 లేదా 3 ఎమ్మెల్యేలు ఉంటే.. అక్కడా గెలుపొందామని.. తెలంగాణలో కూడా అలాగే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్.. అని నితిన్ నబిన్ అన్నారని, రేవంత్ ఫుల్ టైం పొలిటీషియన్ అని నేను ఒప్పుకుంటా.. కానీ రాహుల్ ఆయనతో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా రేవంత్ తీరుందన్నారు. రాబోయే రోజుల్లో బెంగాల్ కంటే మించి పార్టీ కార్యక్రమాలు చేపడతామన్నారు. పార్టీలో పాత, కొత్త అనేది లేదు.. అదంతా ఎవరో క్రియేట్ చేస్తున్నారని కొట్టిపారేశారు.