2 July, 2026 | 1:51 AM

అడిగేది ఎవరనీ..

02-07-2026 12:37 AM
  1. అధ్వాన్నంగా పనులు...
  2. చెరువు కట్టకు రూ. 35 లక్షల మంజూరు..
  3. పనులు చూస్తే ఆశ్చర్యం..

తాడ్వాయి, జూలై, 1 (విజయ క్రాంతి): భూగర్భ జలాలను అభివృద్ధి పరచాలని, రైతులకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది.కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు అద్వాన్నంగా మారుతున్నాయి. అడిగేది ఎవరని... ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. సదరు కాంట్రాక్టర్ సంబంధిత శాఖ అధికారులతో కుమ్మక్కై పనులను పూర్తిగా అధ్వాన్నంగా చేశారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పెద్ద చెరువు కట్టకు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.35 లక్షల నిధులు మంజూరు చేసింది.ఈ నిధులతో చెరువు కట్టను బలోపేతం చేయాలని సంకల్పించింది. చెరువు కట్ట బలహీనంగా ఉన్నచోట కట్టను బలోపేతం చేసి కట్ట తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి సదరు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి నిధులు మంజూరు చేయించారు.

కానీ మంజూరు అయిన  నిధులను సద్వినియోగం చేయడంలో అధికారులు పూర్తిగా విప్లమయ్యారు. నామమాత్రంగా పనులు చేసి పనులు ముగించారు. చెరువు కట్టుకు రూ.35 లక్షల మంజూరు అయితే కనీసం రూ.10 లక్షల పని కూడా జరగలేదని స్థానికులు వాపోతున్నారు.

కట్టపై ఒక ఇంచు మొరం పోయలేదు..

చెరువు కట్టపై సదరు కాంట్రాక్టర్ ఒక ఇంచ్ కూడా మొరంపోయకుండానే పనులు ముగించారు. చెరువు కట్టకు కిందివైపు మొరాన్ని పోసి వదిలేశారు  సదరు కాంట్రాక్టర్ సంబంధిత శాఖ అధికారులతో కుమ్మక్కై పనులను అధ్వానంగా నిర్వహించారు. కట్ట కింద 140 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ కట్ట బలంగా ఉంటే చెరువులో నీళ్లు ఎక్కువగా నిలువ ఉంటాయి.దీంతో ఉన్న భూమి అంతా సాగు అయ్యే అవకాశం ఉంది. 

కట్టను బలోపేతం చేయాలి

చెరువు కట్టకు మంజూరైన నిధులతో కట్టపై మొరంపోసి మొరాన్ని రోలర్ తో తొక్కించాలి, ఈ రకంగా కట్టను బలోపేతం చేయాలి. కానీ కట్టపై ఎలాంటి మొరం పోయకుండానే చెరువులో తవ్విన నాసిరకం మోరాన్ని కట్టపై నామమాత్రంగా పోసి చేతులు దులుపుకున్నారు. మొరం తొక్కించడం కోసం తీసుకువచ్చిన  రోలర్ ను కట్టపై అలా పది రోజుల పాటు ఉంచి, రోలర్ తో ఏమి పని చేయకుండానే రోలర్ ను తిరిగి పంపించి వేశారు.

ఈ విషయమై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కట్టకు తిరిగి పనులు నిర్వహించి కట్టను బలోపేతం చేయాలని రైతులు కోరుతున్నారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.

చెరువు కట్టకు రూ.35 లక్షలు మంజూరు.. 

- నందివాడ పెద్ద చెరువుకు రూ 35 లక్షలు మంజూరయ్యాయి.ఈ నిధులతో చెరువు కట్టను బలోపేతం చేయాలి. చెరువు కట్టపై మొరం పోసి తొక్కించాలని తెలిపారు.కానీ మొరాన్ని పోసి తొక్కించలేదు కదా అని విజయ క్రాంతి వివరణ కోరగా మొరం లభ్యం కావడం లేదు. తరువాత మొరం పోసి  తొక్కిస్తామని తెలిపారు.. పనులు పూర్తయ్యాయా అని కోరగా దాదాపు పూర్తయినట్లే అని ఏఈ తెలిపారు.

ఇరిగేషన్ ఏఈ మధు