2 July, 2026 | 2:33 AM

ఊరంతా ఒక్కటై.. మద్యానికి దూరమై..

02-07-2026 01:49 AM

స్వచ్ఛందంగా సంపూర్ణ మధ్య నిషేధం అమలు

పెద్దలు, యువత కలిసి కట్టుగా తీసుకున్న నిర్ణయం

ప్రశాంత జీవనం గడుపుతున్న తమ్మరబండపాలెం వాసులు

కోదాడ, జూలై 1: సామాజిక క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది కోదాడ పట్టణంలోని 4వవార్డు తమ్మరబండపాలెం. ప్రభుత్వ నిషేధం కాదు.. పోలీసుల నిఘా కాదు.. గ్రామ పెద్దలు, యువకుల స్వచ్ఛంద నిర్ణయంతో 3 దశాబ్దాలుగా మద్యం విక్రయాలకు చెక్ పెట్టిన ఈ గ్రామం ఇప్పుడు ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది.

మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్న తరుణంలో కోదాడ పట్టణంలోని 4వ వార్డు తమ్మరబండపాలెం గ్రామం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. దాదాపు 30 ఏళ్ల క్రితమే గ్రామంలోని యువకులు,పెద్దలు కలిసి ఒకే మాటపై నిలబడ్డారు. గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టకూడదని, దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరగకూడదని పెద్దల సమక్షంలో లిఖితపూర్వకంగా నిర్ణయం తీసుకున్నారు.

అప్పటి నుంచి నేటి వరకు గ్రామంలో ఒక్క బెల్ట్ షాపు కూడా కనిపించలేదు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయాలకు ప్రయత్నిస్తే గ్రామ పెద్దలు,యువత కలిసి అడ్డుకుంటారు. మద్యం అందుబాటులో లేకపోవడంతో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉపాధి, కుటుంబ బాధ్యతలపై దృష్టి సారిస్తున్నారు. గ్రామంలో చిన్న చిన్న గొడవలు, కుటుంబ కలహాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితులు కూడా చాలా వరకు కనిపించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.

ఊరంతా ఒక్కటై..: 

గ్రామంలో సామాజిక ఐక్యతే ఈ విజయానికి కారణమని పెద్దలు పేర్కొంటున్నా రు. గ్రామ ప్రశాంతతను భంగం కలిగించే ఆకతాయిలకు అవకాశం ఇవ్వకుండా అంద రూ కలిసి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.యువత కూడా పెద్దల నిర్ణయాన్ని గౌరవిస్తూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.మద్యం రహిత గ్రామంగా తమ్మర బండపాలెం ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా సామాజిక చైతన్యం ఉంటేనే మార్పు సాధ్యమవుతుందని తమ్మరబండపాలెం నిరూపిస్తోంది. మద్యం విక్రయాలకు స్వచ్ఛందంగా దూరంగా ఉంటూ 3 దశాబ్దాలుగా ప్రశాంతతను కాపాడుకుంటున్న ఈ గ్రామం నిజంగా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

గ్రామంలో గొడవలు, తగాదాలు తగ్గాయి

బెల్ట్ షాపులు లేకపోవడం వల్ల గ్రామంలో గొ డవలు,అనవసర తగాదాలు చాలా తగ్గాయి. మ ద్యం వల్ల కుటుంబాలు నాశనం కాకూడదనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు తీసు కున్న నిర్ణయాన్ని మేమంతా ఇప్పటికీ కొనసాగిస్తున్నాం.మా గ్రామం ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.

 ( సూరయ్య, గ్రామస్తుడు)

మా గ్రామంలో మద్యం అమ్మకాలు ఉండవు  

మా గ్రామంలో మద్యం అమ్మకాలు ఉండకూడదని పెద్ద లు, యువకులం కలిసి 30 ఏళ్ల క్రిత మే నిర్ణయం తీసుకున్నాం.అప్పటి నుం చి ఎవరూ ఆ నిర్ణయాన్ని అతిక్రమించలేదు.అందుకే గ్రామంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది.కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటున్నారు అన్నారు.

గ్రామస్తుడు 

ఎస్.కె జానీ సాహెబ్