22న జీఎస్టీ కౌన్సిల్ భేటీ
- ఆన్‌లైన్ గేమింగ్ పన్నుపై సమీక్ష
ముంబై, జూన్ 13: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ ఎనిమిది నెలల తర్వాత సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జూన్ 22న న్యూఢిల్లీలో కౌన్సిల్ భేటీ జరుగుతుందని జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ గురువారం సోషల్ మీడియా ఎక్స్ పోస్టులో తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం 2023 అక్టోబర్ 7న జరిగింది. 53వ సమావేశం 2024 జూన్ 22న జరుగుతుందని సెక్రటేరియట్ వెల్లడించింది.
కౌన్సిల్ సభ్యులకు సమావే శపు ఏజెండా ఇంకా సర్క్యులేట్ చేయనప్పటికీ, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల్లో జరిగే బెట్స్‌పై పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీని విధించాలన్న నిర్ణయాన్ని సమావే శం సమీక్షిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ గేమింగ్, కేసినోలు, హార్స్ రేసింగ్‌ల్లో పూర్తి బెట్ విలువపై 28 శాతం జీఎస్టీ విధింపునకు సంబంధించిన చట్ట సవరణల్ని జీఎస్టీ కౌన్సిల్ గత సమావేశాల్లో ఆమోదించింది. అయితే వీటి అమలును ఆరునెలల తర్వాత సమీక్షిస్తామని కౌన్సిల్ ప్రకటించింది. ఈ సమీక్ష 2024 ఏప్రిల్‌లో జరగాల్సి ఉండగా, ఎన్నికల కారణంగా ఈ నెలలో నిర్వహిస్తున్నారు.






