23 June, 2026 | 12:53 AM

కొత్త గరిష్ఠాలకు స్టాక్ సూచీలు

14-06-2024 12:05 AM
  • 77,145 పాయింట్ల వద్ద సెన్సెక్స్ రికార్డు

23,480 వద్దకు నిఫ్టీ 

ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్ల ర్యాలీ

న్యూఢిల్లీ, జూన్ 13:  దేశీయంగా ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ఠానికి దిగిరావడంతో పాటు అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో వరుసగా రెండో రోజూ మార్కెట్ పరుగు కొనసాగింది. క్రితం రోజు నిఫ్టీ రికార్డు గరిష్ఠస్థాయికి చేరినా, కాస్త దూరంలో నిలిచిపోయిన సెన్సెక్స్ గురువారం ఎట్టకేలకు నూతన రికార్డును నెలకొ ల్పింది. ఐటీ, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఇండస్ట్రియల్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. ఇండెక్స్ హెవీవెయిట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని ట్రేడర్లు తెలిపారు.   

బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 538 పాయింట్లు ఎగిసి  77,145 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని నమోదు చేసింది. చివరకు 204 పాయింట్ల లాభంతో 76,811 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 158 పాయిం ట్లు ర్యాలీ జరిపి 23,481 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది.  చివరకు 76 పాయింట్ల లాభంతో 23,399 పాయిం ట్ల వద్ద క్లోజయ్యింది. ఈ స్థాయిల్లో స్టాక్ సూచీలు ముగియడం ఇదే ప్రధమం. 

ఆర్బీఐ రేట్ల కోతపై ఆశలు

రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తుం దన్న ఆశలు ఇన్వెస్టర్లలో మొదలయ్యాయని, అలాగే అమెరికాలో సైతం ద్రవ్యోల్బణం దిగిరావడంతో ఈ ఏడాది ఫెడరల్ రిజర్వ్ రెండు దఫాలు రేట్లను కట్ చేస్తుందన్న అంచనాలు నెలకొన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టింది.

ఫెడ్ అధికారులు ఈ ఏడాది ఒక దఫా మాత్రమే రేట్ల కోత ఉంటుందన్న సంకేతాలను అందించగా, రెండుసార్లు తగ్గిం చే అవకాశం ఉంటుందన్న అంచనాల్ని కొందరు విశ్లేషకులు వెల్లడించారు. ఫెడ్ సంకేతాల పట్ల ప్రపంచ మార్కెట్ల స్పందన మిశ్ర మంగా ఉన్నదని, గురువారం యూరప్ షేర్లు భారీగా తగ్గాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు. ఆసియాలో సియోల్, హాంకాంగ్ మార్కెట్లు పెరగ్గా, టోక్యో, షాంఘైలు తగ్గాయి. 

మరో కొత్త రికార్డుకు మార్కెట్ విలువ

గురువారంనాటి ర్యాలీతో స్టాక్ సూచీలతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్ విలువ లో కూడా రూ.431.67 లక్షల కోట్లకు చేరి మరో సరికొత్త రికార్డుస్థాయిని నమోదు చేసింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,31,67,542 కోట్లకు (5.17 ట్రిలియన్ డాలర్లు) పెరిగింది.