calender_icon.png 19 December, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టంగూరులో ఉద్రిక్తతల మధ్య ఉపసర్పంచ్ ఎన్నిక

19-12-2025 07:05:31 PM

ఉప సర్పంచ్  గుండు రాంబాబు ఎన్నిక 

నకిరేకల్,(విజయక్రాంతి)కట్టంగూరు గ్రామపంచాయతీలో శుక్రవారం నిర్వహించిన ఉపసర్పంచ్ ఎన్నిక ఉద్రిక్తతల నడుమ జరిగింది. ఎన్నిక సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. గ్రామపంచాయతీలో మొత్తం 14 మంది వార్డు సభ్యులు ఉండగా, ఈ నెల 11న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ రెబల్స్, బీఆర్‌ఎస్‌, బీజేపీ తరఫున మరో ఏడుగురు వార్డు సభ్యులు గెలుపొందారు.

అదే రోజు జరగాల్సిన ఉపసర్పంచ్ ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడింది. అనంతరం ఈ నెల 12న ఏర్పాటు చేసిన సమావేశానికి సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నికను డిసెంబర్‌ 19కు వాయిదా వేశారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమావేశానికి సర్పంచ్‌తో పాటు 14 మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుండగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఒకరినొకరు నెట్టివేసుకున్నట్లు సమాచారం. దీంతో సమావేశంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఉపసర్పంచ్ అభ్యర్థిగా 8వ వార్డు సభ్యుడు గుండు రాంబాబు పేరును కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు వార్డు సభ్యులు ప్రతిపాదించి మద్దతు తెలిపారు.

రాంబాబుతో కలిపి మొత్తం ఎనిమిది మంది సభ్యుల మద్దతు లభించడంతో ఆయన ఉపసర్పంచ్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అంబటి అంజయ్య ప్రకటించారు. సమావేశంలో జరిగిన తోపులాటలో నాలుగో వార్డు సభ్యురాలు ఏకుల సుజాత స్వల్పంగా గాయపడగా, 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాలిగౌరారం రూరల్ సీఐ కొండల్‌రెడ్డి, కట్టంగూర్ ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.