కమలానగర్‌లో జిమ్ పరికరాలు మాయం!
ప్రజల సొమ్ము ఎక్కడ? బాధ్యులు ఎవరు?
కుషాయిగూడ మార్చి 14 (విజయక్రాంతి): కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ డివిజన్లో ఉన్న కమలానగర్ కాలనీలో ప్రజాధనంతో ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలు అకస్మాత్తుగా మాయమవ్వడం తీవ్ర సంచలనానికి దారితీసింది. యువత ఆరోగ్యం కోసం ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం లక్షల రూపాయల ప్రజాధనంతో కమలానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసి యేషన్ కార్యాలయంలో జిమ్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఆ జిమ్లో ఉన్న పరికరాలు పూర్తిగా కనిపించకపోవడం కాలనీవాసుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన జిమ్ గదిలో పరికరాలు కొంతకాలంగా వినియోగంలో లేకపోయినా అక్కడే ఉన్నాయని స్థానికులు భావించారు. కానీ ఇటీవల గది తలుపులు తెరిచి చూడగా ఒక్క పరికరం కూడా కనిపించక పోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన లక్షల రూపాయల విలువైన జిమ్ పరికరాలు ఇలా అదృశ్యం కావడం వెనుక ఎవరి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాలనీ ప్రజ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ప్రశ్న లు లేవనెత్తుతున్నారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన ప్రజాప్రయోజన సదుపాయాలు ఇలా మాయమవడం అత్యంత దారుణమని కాలనీవాసులు మం డిపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి జిమ్ పరికరాలు అదృశ్యం కావడానికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే నిజాలను బయటపెట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధమని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.




